మూకుమ్మడి జాతి ప్రక్షాళన ముప్పు పొంచి వుంది

There is a threat of mass ethnic cleansing– ఐక్యరాజ్య సమితి నిపుణురాలి హెచ్చరిక
– తక్షణమే కాల్పుల విరమణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
న్యూయార్క్‌ : మూకుమ్మడి జాతి ప్రక్షాళన ముప్పును పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణురాలు హెచ్చరించారు. తక్షణమే కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ‘ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో, ఇజ్రాయిల్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా వున్నాయి.’ అని ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో మానవ హక్కుల పరిస్థితులను అధ్యయనం చేసే ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారి ఫ్రాన్సెసా అల్బనీస్‌ వ్యాఖ్యానించారు. 1948 నక్బా, 1967 నక్సా సంఘటనలు అంతకన్నా తీవ్రమైన స్థాయిలో పునరావృతమయ్యే ముప్పు కనిపిస్తోందని అన్నారు. ఇవి మరోసారి చోటు చేసుకోకుండా నివారించేందుకు అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని కోరారు. 1947-49 మధ్య కాలంలో ఏడున్నర లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు తమ ఇళ్ళనుండి, భూభాగాల నుండి వెళ్లగొట్టబడిన నక్బా సంఘటన పునరావృతమవుతోందని ఇజ్రాయిల్‌ అధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సమయంలోనే 1948లో ఇజ్రాయిల్‌ ఏర్పడింది. నక్సా సమయంలో మూడున్నర లక్షల మందికిపైగా పాలస్తీనియన్లు నిర్వాసితులయ్యారు. 1967లో వెస్ట్‌ బ్యాంక్‌, గాజాలను ఇజ్రాయిల్‌ ఆక్రమించడానికి ఈ సంఘటన దారి తీసింది.
ఇజ్రాయిల్‌ ఇప్పటికే యుద్ధం ముసుగులో పాలస్తీనియన్ల జాతి ప్రక్షాళన చేపట్టిందని ఆమె విమర్శించారు. పైగా ఆత్మ రక్షణ పేరుతో తాము చేస్తున్న దాన్ని సమర్ధించుకుంటోందన్నారు.
పూర్తిగా కాల్పుల విరమణ జరగకుండా మానవతా కారిడార్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని దోహా ఇనిస్టిట్యూట్‌కి చెందిన విశ్లేషకుడు తమీర్‌ కార్‌మంట్‌ వ్యాఖ్యానించారు.