అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..

In America Again firing..– నిందితుడి కోసం పోలీసుల విస్తృత గాలింపు
– 22 మంది మృతి
మైన్‌ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మైన్‌ రాష్ట్రంలోని లెవిస్టన్‌ నగరంలో బుధవారం రాత్రి ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగ బడటంతో 22 మంది దుర్మరణం చెందారు. సెమీ ఆటోమేటిక్‌ తుపాకీతో నిందితుడు ఓ బౌలింగ్‌ యాలీ, మరో రెస్టారెంట్‌లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు జనం పరుగులు తీశారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో మరో 60 మంది గాయాల పాలయ్యారు. కాగా కాల్పులు జరిపినట్లు భావిస్తున్న అనుమానితుడి ఫొటోను పోలీసులు సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. అందులో అతడు సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌తో కన్పించాడు. గతంలో యూఎస్‌ ఆర్మీలో పనిచేసిన ఓ రిజర్వ్‌ సభ్యుడిగా అనుమానిస్తున్నారు. నిందితుడిని రాబర్ట్‌ కార్డ్‌గా గుర్తించారు. ఇతడు మైనేలోని యూఎస్‌ ఆర్మీ రిజర్వ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఫైర్‌ఆర్మ్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసి రిటైర్‌ అయినట్టు పోలీసులు తెలిపారు. 40 ఏండ్ల రాబర్ట్‌.. గతంలో గృహహింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మైనే ప్రాంతంలోని ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై ఆండ్రోస్కోగ్గిన్‌ కౌంటీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తాత్కాలికంగా స్థానిక వ్యాపార సంస్థలను మూసివేయాలని.. స్థానికులు తాత్కాలికంగా ఇండ్లలోనే ఉండాలని, ఇండ్ల తలుపులు మూసి ఉంచుకోవాలని సూచించారు.