ప్లెజర్‌, ప్రెజర్‌ రెండూ ఉంటారు

పవన్‌కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలయికలో పి.సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రో’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్‌ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ‘మై డియర్‌ మార్కండేయ’ పాట విడుదలై మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా సంగీత దర్శకుడు తమన్‌ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఉన్నత స్థాయి సంగీత నేపథ్యం..
పవన్‌ కళ్యాణ్‌తో నేను చేసిన వకీల్‌ సాబ్‌, భీమ్లా నాయక్‌, బ్రో మూడు సినిమాలూ రీమేక్‌లే. పవర్‌స్టార్‌కి మ్యూజిక్‌ చేయడం ఒక అభిమానిగా ప్లెజర్‌, అభిమానుల నుంచి ప్రెజర్‌ (నవ్వుతూ). ఒరిజినల్‌ ఫిల్మ్‌లో పాటల్లేవు. నేపథ్య సంగీతం చాలా బాగా చేశారు. అక్కడ ముఖ్యమైన పాత్రను సముద్రఖని చేశారు కాబట్టి అది సరిపోతుంది. కానీ ఇక్కడ పవన్‌ కళ్యాణ్‌ నటించడంతో ఇంకా ఎక్కువ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాలని పాటల్లోనూ, నేపథ్య సంగీతంలోనూ కొత్తదనం కనిపిస్తుంది. ఉన్నత స్థాయి నేపథ్య సంగీతం ఉంటుంది. సముద్రఖనితో పని చేయడం చాలా బాగుంది. తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అదరగొట్టాడని అందరికీ చెప్పేశారు. అలాగే దర్శక, నిర్మాతలతో పాటు ఇతర చిత్ర బృందం ఇప్పటికే ఈ చిత్రం చూసి నేపథ్య సంగీతానికి కంటతడి పెట్టుకున్నారు.
చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి
పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలయికలో వచ్చే పాట ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఆ పాటను మాస్‌గా చేయలేం. సామెతలు లాగానే చెప్పాలి. ప్రత్యేక గీతాలు లాంటివి స్వరపరచలేం. ఇది అలాంటి సినిమా కాదు. కొన్ని పరిధులు ఉన్నాయి. ఇందులో నాలుగు పాటలు ఉంటాయి. పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ అద్భుతంగా నటించారు. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. వాటిని తెరపైనే చూడాలి.
అందర్నీ కదిలించే సినిమా
జీవితం అంటే ఏంటో తెలిపేలా ఉండే ఈ సినిమా ఎంతోమందిని కదిలిస్తుంది. హత్తుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అద్భుతంగా ఉంటాయి. త్రివిక్రమ్‌ రచన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. పవన్‌ కళ్యాణ్‌, తేజ్‌ మధ్య ఎంత మంచి అనుబంధం ఉంటుందో అది తెర మీద బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ‘వకీల్‌ సాబ్‌, భీమ్లా నాయక్‌’ సినిమాలకు పూర్తి భిన్నంగా కొత్త పవన్‌ కళ్యాణ్‌ని చూస్తాం.
ట్రోల్స్‌ని పట్టించుకోను..
ట్రోల్స్‌లో మంచిని తీసుకుంటాను, చెడుని పక్కన పెట్టేస్తాను. కొందరేదో కావాలని సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తే, మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆరు నెలల నుంచి ‘గుంటూరు కారం’ సినిమా మీద పని చేస్తున్నాం. బయట జరిగే అసత్య ప్రచారాలను నమ్మకండి. ఏదైనా ఉంటే నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారు. కావాలని ఎవరూ ఫ్లాప్‌ సినిమాలు చేయరు. కొన్నిసార్లు సినిమా ఆలస్యమవ్వడం అనేది సహజం. దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ పదే పదే దాని గురించి ట్రోల్‌ చేయాల్సిన పని లేదు.
– తమన్‌