– విద్యుత్ ఉద్యోగులు భేషుగ్గా పనిచేస్తున్నారు : ఉపముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కావాల్సినంత కరెంటు అందుబాటులో ఉందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేసేందుకు విద్యుత్‌శాఖ ఉద్యోగులు చిత్తశుద్ధితో, క్రమశిక్షణగా పనిచేస్తున్నారని చెప్పారు. ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నదనీ, గత ఏడాదితో పోల్చినప్పుడు ఇప్పుడు 52.9 శాతం పెరుగుదల నమోదయ్యిందని వివరించారు. ఈ మేరకు మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది మే నెలలో సరాసరి విద్యుత్ డిమాండ్ 7,062 మెగావాట్లు కాగా, ఈ ఏడాది మే నెలలో 10,799 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 47.6 శాతం పెరుగుదల నమోదయ్యిందన్నారు. ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు నిరంతరం పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల్ని అభినందించాల్సిన ప్రతిపక్షాలు, కరెంటు కోతలంటూ తప్పుడు ప్రచారంతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేసిన రోజులు గుర్తుచేసుకోవాలనీ, దీనిపై అప్పటి టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు అప్పటి ప్రభుత్వ తీరును ఆక్షేపించిన విషయం గమనంలో ఉంచుకోవాలని అన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరనీ, 24 గంటల నిరంతర విద్యుత్‌ను వినియోగించుకుంటున్న విషయం వారికి అనుభవంలో ఉన్నదని చెప్పారు.