ఆదివాసుల్లో ‘అమృత’ వెలుగులేవీ?

No light of 'amrita' among the adivasis?ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది ప్రపంచ ఆదివాసుల దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది. 1994 నుంచి జరుపుతున్న ఈ దినోత్సవాన్ని ఈ ఏడాది ”స్వీయ భరోసా కోసం సమస్యలను పరిష్కరించే వారిగా స్థానిక యువత ఎదగాలి” అనే థీమ్‌ను ప్రకటించింది. కానీ ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సర్కార్‌ నిర్లక్ష్యంగా ఉంది. ఈ దినోత్సవాన్ని పట్టించుకోకపోవడం చూస్తే గిరిజన, ఆదివాసుల పట్ల పాలకులకున్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఆదివాసులతో కార్యక్రమాలు నిర్వహించినా అది ఆ రాష్ట్రాల చొరవతోనే తప్ప కేంద్రం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. వాస్తవానికి ఆదివాసులు ఆధునిక సమాజానికి ఇంకా దూరంగానే జీవిస్తున్నారన్న సంగతి ప్రభుత్వాలు మరవకూడదు. వారి సంస్కృతి, కట్టుబాట్లు, ఆచారాలు మిగతావారితో పోల్చితే భిన్నంగానే ఉంటాయి. కానీ వారి సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం, పారదర్శతకు నిలువెత్తు సాక్షులు వారు. కానీ నిత్యం అసౌకర్యాలతో బతుకు పోరాటం చేస్తూ కష్టాల కారడివిలో జీవన పోరాటం చేస్తున్నారు. భారత రాష్ట్రపతిగా గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము రెండేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఆదివాసుల సమస్యలపై విస్తృత చర్చ జరుగుతున్నది. కానీ మాటలే తప్ప చేతలు కనబడడం లేదు. స్వాతంత్రం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకున్నా ఇప్పటికి గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉండటం శోచనీయం.
చట్టాలున్నా కాగితాలకే పరిమితం
ప్రస్తుతం మన దేశంలో 700 పైగా గిరిజన తెగలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతవనిలో 11 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. మొత్తం జనాభాలో వారు 8.6శాతం.కాని ఆరోగ్యం, సరైన పౌష్టికారం, కనీస మౌలిక వసతులు లేక దుర్భర జీవనం సాగిస్తున్నారు. ఆదివాసుల అధికంగా గల తూర్పు పశ్చిమ కనుమలు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, మధ్య భారత దేశంలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో వనాల విధ్వంసంనకు పాల్పడడం, ఖనిజాల తవ్వకాలు ఆదివాసుల జీవనానికి అవరోధాలుగా మారినాయి. గిరిజనుల సంక్షేమం హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలు కాగితాలకు పరిమితం అవుతున్నాయి. ఆదివాసుల ప్రాంతాల పరిపాలన సంక్షేమంపై రాజ్యాంగంలో 5వ, 6వ షెడ్యూలు ఉన్నాయి. ఆదివాసి గ్రామాలకు స్వీయ పరిపాలన హక్కులు కల్పించే విషయంలో పంచాయతీరాజ్‌ షెడ్యూల్‌ ప్రాంతాల విస్తరణ చట్టం (పెసా)-1996 తెచ్చారు. అలాగే గిరిజనులకు అడవి భూముల హక్కులు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ను అమల్లోకి తెచ్చింది. గిరిజన ప్రాంతాలలో భూ బదలాయింపును నిషేధిస్తూ చేసిన 1/70 చట్టం వుంది. కానీ చట్టాలను పక్కగా అమలుపరిచే సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు మొద్దు నిద్ర నటిస్తున్నాయి.స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు పూర్తయిన గిరిజనుల ఆరోగ్యం వారి అభివృద్ధిపై ప్రభుత్వాలు సరైన దృష్టి సారించడం లేదు. 2022 డిసెంబర్‌ నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ లోని ‘హతి’ కులం వారిని షెడ్యూల్‌ తెగల జాబితాలో చేరుస్తూ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దీనిద్వాఆర కులాల చేర్పు, తొలగింపుల విషయంలో శాస్త్రీయత లేదన్నది స్పష్టమైంది. ఒక రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో ఉన్న వారు మరొక రాష్ట్రంలో ఉండడం లేదు. దీనివల్ల తమ రాష్ట్ర నుంచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే వారికి కులధ్రువీకరణ పెద్ద తలనొప్పిగా తయారైంది. గనుక గిరిజన ప్రజల జీవితాల మీద ప్రభావం చూపే ఏ విధానమైనా శాస్త్రీయ అవగాహనతో, అధ్యయనం జరిపిన తర్వాతే సామాజిక కోణంలో పరిశీలన చేసి అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.
పోడుభూములు..ఆదివాసులు
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గోండులు, ఖోలాంలు, వరంగల్‌ ఖమ్మం జిల్లాలో కోయలు కొండారెడ్లు నాగర్‌ కర్నూల్‌ నల్గండ జిల్లాలో చెంచులు నివసిస్తున్నారు. నాయకపోడు, బంజారాలు, యానాదులు, ఎరుకలు ఇతర జిల్లాలో ఉన్నారు. వామపక్షాలు చేసిన పోరాటంతో గత రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అక్కడక్కడ పోడు భూములకు పట్టాలిచ్చింది. కానీ అసౌకర్యంగా ఉన్న భూములు కావడంతో చదును చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అవి చాలాచోట్ల పడావుగానే ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న చాలామంది అర్హులకు భూములు ఇవ్వడం లేదు. వారు అడవుల్లో సాగు చేసుకుంటున్న భూములను ఫారెస్టు అధికారులు ధ్వంసం చేస్తున్నారు. అక్కడినుంచి వెళ్లిపోవాలని, ఇది సర్కార్‌ భూమి అంటూ వారిని బెదిరిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి. ఆదివాసులు మైదాన ప్రాంతాల్లో ఉన్నవారిలా బతకలేరు. ఎందుకంటే అడవితోనే నిత్యం సంబంధం కలిగి ఉంటారు. అయితే పాల కుల విధానాలతో వారి జీవితాలు నేడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. వారి జీవన భద్రత, కుటుంబాల పోషణ దినదినగండమవుతున్నది. ఈ నేపథ్యంలో వారికి ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. భూములు పంపిణీ చేయకుండా, విద్యా,వైద్యాన్ని మెరుగుపరచకుండా వారి బతుకులకు ఒక భరోసానివ్వని ఆదివాసుల దినోత్సవాలు ఎన్ని జరిపితే ఏం ప్రయోజనం? ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఆదివాసుల సమస్యలు, వారి జీవనానికి కావాల్సిన భద్రతను కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఆదివాసుల కుటుంబాల్లో సారా పెద్ద సమస్యగా మారింది. పురుషులు దానికి బానిసై అనారోగ్యం పాలవుతున్నారు. కుటుంబాలు నాశనమవుతున్నాయి. సారా తయారీ, సరఫరా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈ సారా తయారి చేసేవాళ్లకు ఇతర ఉపాధి చూపించి ఆర్థిక సహకారం అందించాలి.
ఏజెన్సీ ఏరియాల్లో భూముల ఆక్రమణలు
గిరిజనులకు వైద్య సేవలందించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో సంచార వైద్యశాల నెలకొల్పింది. గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో ఇటువంటివి ఇంకా పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. అధిక శాతం గిరిజన గూడెల్లో తాగునీటి సౌకర్యం లేదు. మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటిని అందించాలి. ఏజెన్సీ ఏరియాగా గుర్తించబడిన ప్రాంతాల్లో 1/70 చట్టం సంపూర్ణంగా అమలు కావడం లేదు. ఈ చట్టాన్ని కాపాడాల్సిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు పట్టించుకోకపోవడంతో గిరిజన ప్రాంతాల్లో అక్రమార్కులు భూముల క్రయవిక్రయాలు జరుపుతూ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు.ఈ ఆక్రమణలను నియంత్రించాల్సిన అవసరం అధికార యంత్రాంగంపై ఉన్నది. చాలా జిల్లాల్లో పోడు గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రమే ఉంది.
నాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పోరు గ్రామాలు నేటికీ అసౌకర్యాలతో సహవాసం చేస్తున్నాయి. సరైన రహదారులు, పౌష్టికాహారం, వైద్య సేవలు లేక మనగడ కోసం నిత్యం పోరాటం కొనసాగించాల్సిన దుస్థితి ఆ గ్రామవాసులది. ఆదివాసుల బతుకులు బాగుపరచడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తన వంతుగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు కోకొల్లలు. గిరిజనుల స్వయం పాలన, విద్య, ఆర్థిక సాధికారికత సాధనకు ఇప్పటికైనా పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఆ అవసరాన్ని ‘ఆదివాసుల హక్కుల దినం’ నొక్కి చెబుతున్నది.

– అంకం నరేష్‌, 6301650324