– ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉండాలి
– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
– ఉత్సాహంగా సాగిన 2కె రన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓటును మించిన ఆయుధం లేదని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును ఉపయోగించు కోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి జోన్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుంచి హైటెక్స్ రోడ్ మెటల్ చార్మినార్ వరకు ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో 2కే రన్ నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్‌జెండర్లు, యువత, దివ్యాంగులు, వాకర్స్ అసోసియేషన్, సైకిలిస్ట్ అసోసియేషన్స్, పోలీసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, స్వేచ్ఛాయుతంగా నైతిక ఓటింగ్ చేయాలని సూచించారు.
రాష్ట్రంలో 3.30 కోట్ల ఓటర్లు ఉన్నారని, ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుంటే ఓటు వృథా అవుతుందని చెప్పారు. ఒక వ్యక్తికి దేశంలో ఎక్కడైనా ఒక చోట మాత్రమే ఓటు ఉండాలన్నారు. పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ‘సి’విజిల్ యాప్‌ను మొబైల్ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు.
బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ గొప్పది : రోనాల్డ్ రోస్
బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ గొప్పదని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. మనం వేసే ఓటు మన భవిష్యత్‌ను నిర్దేశిస్తుందన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్ శాతంలో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతమైనప్పటికీ, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ, ఓటు వేయడంలో నిరాసక్తత చూపుతున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి పెద్ద నియోజకవర్గమని, ఏడు లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారని, ఆదాయం, చదువులో మాత్రమే కాదు.. సామాజిక బాధ్యతలో కూడా ముందున్నామని నిరూపించుకోవాలన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ఇంట్లో, ఆఫీసులలో, బంధువులు, స్నేహితులను చైతన్యపర్చాలన్నారు. 2కే రన్‌లో టాప్‌గా వచ్చిన 5 గురికి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిభాసింగ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్, ఏసీపీతోపాటు ఆయా అధికారులు పాల్గొన్నారు.