ఇజ్రాయిల్‌కు, గాజాలోని హమస్‌కు మధ్య కాల్పుల విరమణ జరిగే ఆశ లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నాడు. గురువారంనాడు అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ బయట మీడియాతో మాట్లాడుతూ కాల్పుల విరమణకు అవకాశమే లేదని ఆయన అన్నాడు. హమస్ ను నాశనం చేసేదాకా ఇజ్రాయిల్ కాల్పుల విరమణ చేయటానికి సిద్దంగా లేదని, గత మూడు రోజులుగా దీర్ఘ కాల్పుల విరణమణకు తాను ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదని బైడెన్ తన ”ఎయిర్ ఫోర్స్ ఒన్” విమానం ఎక్కేముందు మీడియాకు చెప్పాడు.ఇప్పటివరకూ మానవతా సహాయం అందించేందుకు ఇజ్రాయిల్ అప్పుడప్పుడు కాల్పులకు విరామం ఇస్తున్నదని, ఇదే ”పెద్ద ముందడుగు” అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఒక పత్రికా సమావేశంలో చెప్పాడు. ప్రతిరోజు ఉత్తర గాజాలో నాలుగు గంటలపాటు ఇజ్రాయిల్ కాల్పులను ఆపుతోంది. అలా ఆపటానికి మూడు గంటల ముందు కాల్పులను ఆపే సమయాన్ని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటిస్తోందని కిర్బీ రిపోర్టర్లకు చెప్పాడు. ఇలా చేయటం కూడా గురువారం నుంచే ప్రారంభమైంది. ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతంపైన అక్టోబర్ 7వ తేదీనాడు హమస్ చేసిన మెరుపుదాడిలో అనేక వందలమంది చనిపోయారు. అనేక మంది హమస్ బంధీలుగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోను కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ఇజ్రాయిల్ పదేపదే ప్రకటిస్తోంది. బంధీలను వదిలేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యాహు అనేక సార్లు ప్రకటించాడు. అయితే ప్రయివేటు సంభాషణలో బంధీలను విడుదల చేసినప్పటికీ కాల్పుల విరమణ జరిపేది లేదని ఇజ్రాయిల్ చెబుతోంది. కొందరు బంధీలను మార్పిడి చేయటం కోసం ఐదు రోజులపాటు కాల్పుల విరమణ చెయ్యాలనే ప్రతిపాదనను నెతాన్యాహు ఇప్పటికే తిరస్కరించాడని లండన్ నుంచి వెలువడే ద గార్డియన్ పత్రిక రాసింది. పిల్లలను, మహిళలను, వృద్ధులను విడిపించాలనే ప్రయత్నం జరిగినప్పుడు కూడా నేతాన్యాహు కాల్పుల విరమణకు తిరస్కరించాడు.