జాగ్రత్తలు పాటిస్తే మలేరియా వచ్చే అవకాశమే లేదు: డాక్టర్ పి రవీందర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రజలు వర్షాకాలంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే మలేరియా జ్వరాల బారిన పడే అవకాశమే ఉండదని జిల్లా టిబి మలేరియా, ప్రోగ్రాం అధికారి డాక్టర్ పి రవీందర్ అన్నారు. శనివారం మండలంలోని పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ మధు ఆధ్వర్యంలో దేవుని గుట్ట అనే గుర్తిపోయే గ్రామాన్ని సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ ఇంటి ఆవరణ పరిసరాలు వీధులు చెత్త చెదారం పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రపరచుకోవాలని, ప్రభుత్వం అందించిన దోమతెరలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వర్షాకాలంలో వాగులో చెలిమలు, ఓర్రెలలో నీటిని తాగకుండా కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని సూచించారు. స్థానికంగా ఉంటున్న వైద్య సిబ్బంది సలహాలు సూచనలు పాటిస్తూ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నారు.జిల్లాలోనే అత్యంత ప్రమాదకరమైన మలేరియాకి కేంద్ర బిందువుగా ఉన్న గోవిందరావుపేట మండలం లో నివారణకు ప్రతి ఒక్కరము కృషి చేయాలన్నారు. గుత్తి కోయగూడెంలో 22మందికి వైద్యపరీక్షలు చేసినాము. ఎవరికి కూడా మలేరియా లేదు. కొంతమంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వారికి ఆరోగ్య సూత్రాలు వివరించి, హెల్త్ ఎడ్యుకేషన్ గూర్చి చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ నర్సింగరావు,ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగరావు,హెల్త్ సూపర్ వైజర్ పుష్ప, ఏ ఎన్ ఎం సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.