హామీలపై బడ్జెట్‌లో స్పష్టత లేదు

– బీజేపీ సభ్యులు పాయల్‌ శంకర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు రాష్ట్ర బడ్జెట్‌లో స్పష్టతనివ్వలేదని బీజేపీ సభ్యులు పాయల్‌ శంకర్‌ విమర్శించారు. రుణమాఫీ విషయంలో రూ. 31వేల కోట్ల అంచనా ప్రభుత్వం ఎలా వేసిందో అర్థం కావడం లేదన్నారు. నిర్ధిష్టమైన గడువులోగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతు బీమాకు ప్రీమియం ఎప్పటిలోగా చెల్లిస్తారో సభకు చెప్పాలని కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. రైతులకు వడ్డీలేని రుణాల ఇస్తామన్న హామీని సర్కారు నిలబెట్టుకోలేదని విమర్శించారు. అన్ని పంటలకు బోనస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకు మాత్రమే ఇస్తాననడం సరైందికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం సరైందికాదన్నారు.