– ‘గోడీ మీడియా’ లక్ష్యంగా కాంగ్రెస్ వీడియో
న్యూఢిల్లీ : రిపబ్లికన్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామి తన టీవీ షోలలో ప్రధాని నరేంద్ర మోడీపై అపరిమితమైన స్వామిభక్తిని ప్రదర్శిస్తుంటారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తుంటారు. ఈ నేపథ్యంలో గోస్వామి షోలపై కాంగ్రెస్ పార్టీ ఓ వ్యంగ్య వీడియోను రూపొందించింది. ఇద్దరు రాజకీయ నాయకుల పక్కన కూర్చొని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన రిపబ్లికన్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామిని అందులో అనుకరించింది. వాస్తవానికి ప్రసారం చివరలో కెమేరాను జూమ్ అవుట్ చేసినప్పుడు గోస్వామి ఆ రాజకీయ నాయకుల పక్కన కాకుండా వారి ఒడిలో కూర్చున్నట్లు కన్పించింది. రాజకీయ నాయకుల ఒడిలో మీడియా కూర్చుంటే రాజ్యాంగం ఉండదు…ప్రజస్వామ్యమూ ఉండదు అంటూ కాంగ్రెస్ వీడియో ప్రకటన చివరలో ఓ వ్యాఖ్య విన్పిస్తుంది.
‘పాపా నే వార్ రుక్వే ది’ అనే కాంగ్రెస్ వీడియో ప్రకటన బీజేపీని బాగా ట్రోల్ చేసింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆపేశారని అందులో ఓ మహిళ తన తండ్రికి చెబుతుంది. ధరల పెరుగుదల వంటి అంశాలకు మీడియా అతిగా ప్రాధాన్యత ఇస్తోందని ఆ ప్రకటనలో విమర్శించారు. ప్రధాని మోడీని ఉద్దేశించి యాంకర్ మాట్లాడుతూ ‘ఈ దేశానికి సాహెబ్ ఇచ్చిన దిశ జాతికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. డీజిల్, పెట్రోల్ ధరలు బాగా తగ్గిపోయాయని, ప్రజలు నీటికి బదులు వాటినే వాడుతున్నారని కూడా యాంకర్ సెలవిచ్చారు. పాలు, కూరగాయలు కొనుగోలు చేయడానికి కొంచెం డబ్బు ఉంటే చాలునని కూడా ఆయన చెప్పారు.
యాంకర్ అంతటిలో ఆగలేదు… విదేశాలకు వెళ్లాలంటే వీసా అవసరం లేదని, భారతీయ పాస్‌పోర్టు ఉంటే సరిపోతుందని, రూపాయి విలువ ఆకాశాన్ని తాకిందని, ఎంతగా అంటే దానిని కిందికి దించాలంటే రాకెట్‌ను ప్రయోగించాల్సిందేనని చెప్పుకొచ్చారు. అతిశయోక్తులతో కూడిన 58 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో చిత్రీకరణ పూర్తయిన తర్వాత స్టూడియోలో సెట్‌ను తీసివేసే సమయంలో కెమేరా జూమ్ అవుట్ అవుతుంది. ఇద్దరు రాజకీయ నాయకుల ఒడిలో యాంకర్ కూర్చొని ఉన్నట్లు కన్పిస్తుంది. ఆ యాంకర్ వారిని పదేపదే ‘నాకు టిప్ ఇవ్వండి’ అని అడుగుతారు. వారు అతనికి రెండు లాలీపాప్‌లు ఇస్తారు. ‘నాకు డ్రగ్స్ ఇవ్వండి’ అనే గోస్వామి కార్యక్రమాన్ని అనుకరిస్తూ ఈ వీడియోను రూపొందించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1, ఏప్రిల్ 12 తేదీల మధ్య అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ వరల్డ్ షోలో 137 చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో 73 కార్యక్రమాలు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా రూపొందించినవని, 32 ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని ‘న్యూస్‌లాండ్రీ’ పోర్టల్ సర్వేలో తేలింది.