బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య గ్యాప్‌ లేదు

bjp laxman– సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తుంది
– బీసీ సీఎంని చేస్తామంటే రాహుల్‌గాంధీ విమర్శిస్తున్నారు
– మీట్‌ది ప్రెస్‌లో డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదనీ, ఆ సంస్థ తమ పార్టీకి సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తుందని బీజేపీ పార్లమెంటరీ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీట్‌ ది ప్రెస్‌లో మాట్లాడారు. యువత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ సర్కారు నీళ్లు, నిధులు, నియామకాల హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరగడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు రూ.5 లక్షల కోట్లకు అప్పు చేసిపెట్టాడని విమర్శించారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రహసనంగా మారిందనీ, 18 సార్లు పేపర్లు లీక్‌ అయ్యాయని చెప్పారు. ఉద్యోగాలురాక, తల్లిదండ్రులకు ముఖం చూపలేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే చావులపైనా అపవాదు, అసత్య ప్రచారాలను కేసీఆర్‌ సర్కారు చేస్తున్నదని విమర్శించారు. పింఛన్‌, ఉచిత పథకాలను చూసి మోసపోవద్దనీ, రూ.50 వేల జీతం పొందే అవకాశమున్న పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్నాడనే విషయాన్ని గ్రహించాలని నిరుద్యోగుల తల్లిదండ్రులకు సూచించారు. తెలంగాణలో కేంద్రం 9 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేసిందని వివరించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలనీ, ఆ రెండు పార్టీలు ఎంఐఎం కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని విమర్శించారు. ప్రధాని మోడీ బీసీని సీఎం చేస్తామంటే రాహుల్‌గాంధీ, కేటీఆర్‌ అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణను తానే తీసుకుంటానని ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే గుజరాత్‌, యూపీ తరహాలో అభివృద్ధి చేసి చూపుతామని చెప్పారు. బీసీ జనగణనకు తాము వ్యతిరేకం కాదనీ, టెక్నికల్‌ సమస్యల వల్ల ముందుకెళ్లలేకపోతున్నామని చెప్పారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర చట్టాన్ని తీసుకొస్తామన్నారు. విభేదాలతో కాదు.. సంస్థాగత మార్పులో భాగంగానే బండి సంజరుని అధ్యక్ష స్థానం నుంచి మార్చారనీ, ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పైస్థాయిలో ఉన్నారని చెప్పారు.