– మోసగాళ్లు కావాలా.. మొనగాళ్లు కావాలా..
– రైతు బంధు, పింఛన్లు పెంచుతాం : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ – భూపాలపల్లి/పరకాల/వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ పథకాలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో సీఎంకు గ్యారెంటీ, వారంటీ లేదని, ఓటుకు నోటు.. సీటు కో రేటు.. మాత్రమే ఉందని, మోసపోతే గోసపడతామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణాలను సైతం లెక్కచేయక సాధించుకున్న రాష్ట్రానికి మోసగాళ్లు కావాలా.. మొనగాళ్లు కావాలా.. ప్రజలు తేల్చుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో రైతు బంధు, పింఛన్ పెంచనున్నామని, త్వరలో సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటిస్తారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు పట్టణాల్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎన్నికలు రాగానే సంక్రాంతి గంగిరెద్దుల్లా గ్రామాల్లోకి ఇతర పార్టీ నాయకులు వస్తారని, మాయమాటలు చెప్పి మోసం చేస్తారని విమర్శించారు. తొమ్మిందేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. 60 ఏండ్లలో తాగు, సాగునీటితో పాటు కరెంటు కోసం గోసపడ్డామన్నారు. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడో అని ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన అనంతరం ఈ తొమ్మిదేండ్లలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. ఒకవైపు అభివృద్ధి.. మరొకవైపు సంక్షేమ పథకాలతో.. జోడెద్దుల రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నట్టు చెప్పారు. పేదింటి ఆడబిడ్డలకు రూ.1.16 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామని, రైతు పెట్టుబడి సాయం కింద 70 లక్షల మంది రైతులకు రూ.73వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు నీళ్లు ఇవ్వకుంటే ఓట్లే అడగనన్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. భూపాలపల్లి లాంటి మారుమూల ప్రాంతంలో మెడికల్ కళాశాల, వంద పడకల ఆస్పత్రి నిర్మించి సర్కార్ దవాఖనాపై నమ్మకాన్ని పెంచిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వందేనన్నారు. ఆచార్య జయశంకర్ సార్ కలలుగన్న రాష్ట్రంలో జయశంకర్ జిల్లా పేరుమీద జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆకాంక్షించారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్‌లో జరిగే సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజే ఎన్నికల కోడ్ వచ్చిందని నవంబర్ 30వ తేదీన శాసనసభ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుందన్నారు. ఈ రెండు తేదీల్లో మూడు, మూడు ఉందని, మూడు, మూడు కలిపితే ఆరు అని మనకు అచ్చొచ్చిన సంఖ్య ఆరు అని మూడవ సారి సీఎం అయ్యేది కేసీఆరే అని స్పష్టంచేశారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలు.. ఎమ్మెల్యేల ఎన్నికలు కాదని, మన తలరాత మార్చే ఎన్నికలన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం మీకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును లక్ష మెజారిటీతో గెలిపిస్తారన్న నమ్మకం తనకుందన్నారు.
దేశంలో తెలంగాణ జనాభా 2 శాతం మాత్రమేనని, అయినా 30 శాతం అవార్డులను సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పంచాయతీరాజ్ మంత్రి దయాకర్‌రావు గెలుచుకున్నారని తెలిపారు. కాగా, ఎన్నికల కోడ్ వస్తుందని గ్రహించిన మంత్రి దయాకర్‌రావు.. సోమవారం ఉదయమే పాలకుర్తి 50 పడకల ఆస్పత్రి, తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా జిల్లాల్లో జరిగిన సభల్లో పాలకుర్తి ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, పెద్ద సుదర్శన్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మెెన్ డాక్టర్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీచైర్మెన్లు డాక్టర్ సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, ఆంగోతు బిందు, జక్కు శ్రీ హర్షిని, పుట్ట మధు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు.