మహిళల భద్రతకు బడ్జెట్‌లో భరోసా లేదు : ఐద్వా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
2024- 25 రాష్ట్ర బడ్జెట్‌లో మహిళల భద్రతకు భరోసా లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విమర్శించారు. స్త్రీ ,శిశు సంక్షేమానికి, మహిళల భద్రతకు తగిన విధంగా నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించడం, స్వయం సహాయక సంఘాలకు రూ. రెండు లక్షలు, రుణ గ్రహీతల ఆకస్మికమృతికి రుణమాఫీ వంటి అంశాలను స్వాగతిస్తు న్నామని తెలిపారు. రూ. 2 లక్షల వడ్డీ లేని రుణమిస్తామని చెప్పటం కూడా హర్షించదగిందేనని పేర్కొన్నారు. కానీ ఈ పథకాలు అమలు జరగడానికి తగిన రీతిలో బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని కోరారు. ఎన్నికల ముందు మహిళలకిచ్చిన హామీలు అమలు చేసే విధంగా నిధుల కేటాయింపులు జరగలేదని తెలిపారు. మహిళలకి నెలకు రూ. 2500లు, కళ్యాణ లక్ష్మి ద్వారా రూ.లక్ష నగదుతో పాటు, తులం బంగారం ఇస్తామనీ, గృహజ్యోతి పథకం పేదలందరికీ అమలు చేస్తామని చెప్పినదానికి అనుగుణంగా నిధుల కేటాయింపులు చేయలేదని పేర్కొన్నారు.