వివేక్‌ పోతే నష్టమేమీ లేదు మ్యానిఫెస్టోలో మార్పులు, చేర్పులుంటాయి

– మ్యానిఫెస్టోలో మార్పులు, చేర్పులుంటాయి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
– ఆ పార్టీలో చేరిన బాపూరావు, కృష్ణారెడ్డి, సుభాష్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి పార్టీని వీడిపోయినా తమకేమీ నష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వివేక్‌ తయారు చేసిన మ్యానిఫెస్టోలో చేర్పులు, మార్పులుంటాయని చెప్పారు. బుధవారం ఢిల్లీలో బోథ్‌ ఎమ్మెల్యే బాపూరావు, కాంగ్రెస్‌ నేత చలమల్ల కృష్ణారెడ్డి, సుభాష్‌రెడ్డి ఆ పార్టీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తమది క్యాడర్‌ బేస్డ్‌ పార్టీ అన్నారు. మాఫియా వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నవారికి కేసీఆర్‌ టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. నిజాయితీతో పనిచేస్తున్న గిరిజన బిడ్డలకు మాత్రం టికెట్లు నిరాకరించారని విమర్శించారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎలక్షన్‌ టాక్స్‌ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నదని ఆరోపించారు. జనసేనతో సీట్ల సర్దుబాటుపై చర్చ నడుస్తున్నదనీ, రెండు రోజుల్లో ఫైనల్‌ అవుతుందని చెప్పారు. మిగిలిన 66 మంది అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామన్నారు. బండి సంజరు కుమార్‌ మాట్లాడుతూ..కేసీఆర్‌కు ప్రజల మీద, వారి ఓట్ల మీద నమ్మకం లేదని విమర్శించారు. ఆయన ప్రాజెక్టుల టెండర్ల సమయంలో మాత్రమే మాట్లాడుతున్నారనీ, లీకులపై స్పందించడం లేదని చెప్పారు. గోదావరి నదిలో ఇసుక ద్వారా వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఆదిలాబాద్‌ జిల్లాలోని ట్రైబల్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ తిరిగి టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. సోయం బాపూరావు గెలుపునకు కృషి చేస్తానని హామీనిచ్చారు. తనకు ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇస్తారని ఆశిస్తున్నానన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయ దుందుబి మోగించబోతున్నదన్నారు. ఒకరిద్దరు నేతలు తమ పార్టీని వీడినా ప్రజలు మాతోనే ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలుపడం ఖాయమన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు విశ్వాసం లేదన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ… గద్వాల అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా ఎంపీగా పోటీచేస్తానని గతంలోనే చెప్పానన్నారు. గద్వాలలో బీసీ అభ్యర్థిని నిలబెడుతున్నామన్నారు.