– దళితులతో కలిసి బహుజనులు పోరాడాలే : బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
– గులాబీ తీర్థం పుచ్చుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
– కేసీఆర్ నాయకత్వంలో పని చేయటం ఆనందంగా ఉందంటూ వ్యాఖ్య
– ప్రవీణ్‌ను త్వరలోనే బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిని చేస్తా : కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘గాడిద వెంట వెళితేనే గుర్రం విలువ తెలుస్తుంది…’ అని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని అన్నారు. కేవలం మూణ్నెల్లలోనే వారికి వాస్తవాలు బోధపడుతున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన నష్టమేమీ లేదని ఆయన అన్నారు. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ఎర్రవెలిల్లోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ… దళితులతోపాటు బహుజనులు కలిసి పోరాటం చేయాలన్నారు. అప్పుడే హక్కులు, రాజ్యాధికారం సాధ్యమవుతాయని చెప్పారు. ఈ క్రమంలో అగ్రవర్ణాల్లోని పేదలను కలుపుకుని పోవాలని చెప్పారు. కాన్షీరాం ఇదే సిద్ధాంతంపై పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని కొనసాగించాల్సిన అవసరముందని సూచించారు. జనాభాలో 20 శాతంగా ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించనిదేమీ లేదన్నారు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దళితుల మీదనే దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బహుజనుల్లో సైతం సామాజిక చైతన్యాన్ని పెంచాలని కోరారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఆ పథకం వల్లే బీఆర్‌ఎస్‌కు దెబ్బ పడిందంటూ చాలా మంది విమర్శిస్తున్నారని వాపోయారు. అది సరికాదని అన్నారు. దళిత బంధును ఎస్సీ వర్గాలు ఎందుకు పాజిటివ్‌గా తీసుకోలేక పోయాయనే విషయమై బహుజన యువ మేధావులు ఆలోచించాలని కోరారు. రైతు బంధుపై కూడా అనేక మందితో చర్చించామనీ, ఆ తర్వాతే అమల్లోకి తెచ్చామని వివరించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అనివార్యంగా కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప తానెప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తానెవర్నీ పరుష పదజాలంతో దురుసుగా తిట్టలేదని అన్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఒకే మాదిరిగా ఉండాలనీ, అంతేతప్ప అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు మరో రకంగా ఉండకూడదని సూచించారు. ప్రవీణ్ కుమార్‌ను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. త్వరలోనే ఆయన్ను బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిని చేస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఉన్నతస్థానం కల్పిస్తామని హామీనిచ్చారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… కేసీఆర్ నాయకత్వంలో పని చేయటం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. బలమైన తెలంగాణ వాదానికి, బహుజన వాదం కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సిద్ధమయ్యామని తెలిపారు. అయితే ఆ పొత్తును రద్దు చేసుకోవాలంటూ మాయావతి తనపై ఒత్తిడి పెంచారనీ, అది ఇష్టం లేకపోవటంతోనే బీఎస్పీకి రాజీనామా చేశానని వివరించారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ‘నీది పాలమూరే, నాది పాలమూరే అంటూనే సీఎం రేవంత్ నన్ను బెదిరించేందుకు ప్రయత్నించారు…’ అని వాపోయారు. అందువల్ల గొర్రెల మందలో తానొక గొర్రెను కాదల్చుకోలేకే బీఆర్‌ఎస్‌లో చేరానని స్పష్టం చేశారు.