– కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ : చమురు ధరలను తగ్గించే అవకాశాలు లేవని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ కార్పొరేట్ మీడియా ఇచ్చిన లీకులను… ఉత్తుత్తినని ఆయన ఖండించారు. ఒకప్పటితో పోలిస్తే చమురు ధరలు గరిష్ఠాల నుంచి భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ మేర వినియోగదారులకు ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని రిపోర్టులు వచ్చాయి. లీటర్‌కు రూ.6 నుంచి పది రూపాయల మేర తగ్గే అవకాశం ఉందని కేంద్రం ప్రచారం చేసుకున్నది. అయోధ్య రామజన్మ భూమి ప్రచారం ఊపందుకుందని భావించినా.. అలాంటిదేమీ లేదంటూ మంత్రి హరదీప్ స్పష్టం చేశారు. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమన్నారు. ధరల తగ్గింపుపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఒడుదొడుకుల కారణంగా అటు అభివృద్థి చెందిన, పొరుగు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయని అన్నారు. భారత్‌లో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, ఎల్‌పీజీ దిగుమతిదారుగా భారత్ ఉందన్నారు. ప్రపంచ మార్కెట్‌లో ఎప్పడికప్పుడు చమురు ధరలు తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఉంటాయని తెలిపారు. అలాంటి స్థితిలో ఏ ప్రభుత్వానికి అయినా చమురు ధరలు తగ్గించడం కష్టంతో కూడుకున్న వ్యవహారమన్నారు.