
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి లేదని డీసీసీ డెలికేట్ తక్కురి దేవేందర్ అన్నారు. బుధవారం మండలంలోని ఉప్లూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేనేలేదన్నారు. రాష్ట్ర ప్రజలను ఇంటికో ఉద్యోగం ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, ప్రతి గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఇలా ఎన్నో హామీలతో నమ్మించి ఏది కూడా అమలు చేయకుండా పదేళ్లు అధికారం అనుభవించి తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలు మరోసారి మీ మాయమాటలు నమ్మక, తెలంగాణ రాష్ట్రన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీకి, ప్రజా ప్రభుత్వంకి పట్టం కట్టారని తెలిపారు. అధికారం కోల్పోయినా ఇంకా మీ బుద్ధి మారడం లేదని విమర్శించారు. కేసీఆర్ దొర బానిసైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మరోసారి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదని, ప్రజా ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్, జిల్లా నాయకులు బోనగిరి లక్ష్మణ్, మారుపక నరేష్, ఎనేడ్ల గంగారెడ్డి, తక్కురి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.