హామీలను నెరవేర్చడంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు

– జూలై నుంచి రూ.31 వేల కోట్లతో రుణమాఫీ అమలు
– నేలకొండపల్లి మండల పర్యటనలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ-నేలకొండపల్లి
పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, ఎన్నికల సమయంలో ఏ హామీలను ఇచ్చామో వాటన్నింటిని దశల వారిగా నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మండల పర్యటనలో భాగంగా మోటాపురం, శంకరగిరితండ, రాజేశ్వరపురం, అమ్మగూడెం, కోరట్లగూడెం, కోనాయిగూడెం, అరెగూడెం, ఆచార్లగూడెం, బోదులబండ, మండ్రాజుపల్లి తదితర గ్రామాలలో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులను మంత్రి స్వయంగా స్వీకరించారు. వాటి పరిష్కారానికి వెను వెంటనే కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ కోసం అవసరమైన నిధులను అన్ని విధాల సమకూరుస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో వచ్చే జూలై నుంచి రుణమాఫీ అమలవుతుందని తెలిపారు. రూ.31 వేల కోట్లతో రైతుల రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం చేయబోయే రుణమాఫీని తట్టుకోలేక ప్రతిపక్షం వాళ్లు నోరుజారి ఏవేవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్లలో అతిపేదవాళ్లకు తొలి విడత మంజూరు చేస్తామని అనంతరం మూడేళ్ల లోపు అర్హులైన ప్రతి ఒక్కరికీ కట్టిస్తామన్నారు. లిఫ్ట్‌లు రిపేరు చేయించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని బోదులబండ గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. రాజేశ్వరపురం గ్రామంలో నేలకొండపల్లి మండలానికి చెందిన కల్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, ఎంపీపీ వజ్జా రమ్య, మూటపురం సొసైటీ చైర్మెన్‌ భాగం హేమంతరావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నెల్లూరు భద్రయ్య, శాఖమూరి రమేష్‌, వెన్నపూసల సీతారాములు, కొడాలి గోవిందరావు, మామిడి వెంకన్న, బొడ్డు బొందయ్య, రేగూరి వాసవి, బచ్చలకూరి జ్యోతి, పెంటమల్ల పుల్లమ్మ, గుడిమల్ల మధు పాల్గొన్నారు.
నేడు చెక్కుల పంపిణీ
నవ తెలంగాణ-ఖమ్మం రూరల్‌
మండలంలోని నాయుడుపేట గ్రామంలో నేడు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్‌ రెడ్డి చేతుల మీదగా కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్‌ చెక్కులు ఆదివారం నాయుడుపేట గ్రామంలో పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కళ్ళెం వెంకటరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు నాయుడుపేట గ్రామానికి వచ్చి స్వీకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలని కోరారు.