– నేటి నుంచి 7వరకు. తల్లిపాల వారోత్సవాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పిల్లలకు తల్లిపాలు అత్యంత శ్రేష్ఠమనీ, చనుబాలిస్తేనే తల్లికి జన్మ ధన్యమైనట్లనీ, పాలిచ్చేతల్లి ఉంటే చంటిపిల్లలకు ఇంక ప్రపంచంలో ఏమీ అవసరం లేదనీ ఒకనాడు భావించే వారు, పిల్లల్ని కనడం, పాలివ్వడం ఒక వరంగా, మాతృత్వానికి పరాకాష్టగా భావించేవారు ఆనాడు. తల్లిపాల ద్వారా ప్రపంచం లోని క్షీరదాలు తమ పిల్లలను తమ పాలతోనే పెంచుతున్నప్పటికీ, ప్రకృతి సహజంగా ప్రసాదించిన తల్లి పాలను ఉ పయోగించుకోక పోవడం మానవజాతి పరిణామంలో ఒక చిత్రాతి చిత్రమైన పరిస్థితి. నేడు వివిధ కారణాల వల్ల తల్లిపాలకు ప్రత్యమ్నాయం అనుసరించడం అత్యంత బాధాకరం. తల్లిపాలను భారత దేశంలో కేవలం 37 శాతం మంది పిల్లలే ఆరునెలల వరకు తాగుతున్నారు. అంటే పిల్లలకు ఎంత తక్కువ పాళ్ళల్లో తల్లి. పాలు అందిస్తున్నారో అర్ధం అవుతోంది. కారణం తల్లిపాల గొప్పతనం తెలియక పోవడం కావచ్చు, కొంతమంది వెసులుబాటు లేకపోవడమో కానీ చాలామంది శిశు వులకి తల్లిపాల రుచి అందడం లేదు. నిజానికి చనుబాలు పిల్లలకు ప్రత్యేక ఔషధంగా పనిచేస్తాయి. తల్లిపాలను సరిగ్గా పిల్లలకు ఇవ్వగలిగితే ఏటా 8.23 లక్షల ” మంది పిల్లలను ఐదేళ్ల లోపు మరణించకుండా కాపాడు కోవచ్చు. పిల్లలకు చనుబాలు ఇవ్వక పోవడం వల్ల, రొమ్ము కేన్సర్లతో మరణిస్తున్న మహిళల సంఖ్య 20 వేల వరకు ఉంది అంటే ఈ సమస్య ఎంత ఎక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
తల్లి పాల విశిష్టతను తెలిపే రీతిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా వాబా (వరల్డ్ అలైన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్షన్) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యు, హెచ్.ఓ, యునిసెఫ్, బి.పి.ఎన్.ఐ వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపు తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం నేడు గురువారం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. పుట్టిన పసి పిల్లలకు శక్తితో పాటు, శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక పరమైన సమస్యలను తల్లి పాలు దరిచేర నియ్యవు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు విధాలైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగించినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగ గలుగుతుంది. తల్లి పాలలో కార్బోహైడ్రేట్స్ 7.1%, ఫాట్స్ 4.5%, ప్రోటీన్స్ 0.9%, మినరల్స్ 0.2%, డైజెస్టివ్ ఎంజైమ్స్, హార్మోన్లు, విటమిన్లు, యాంటీ బాడీలు, లింఫోసైట్లు ఉంటాయి. అందుకే తల్లిపాలను తప్పని సరిగా తాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. కన్న బిడ్డకు తల్లిపాలు పట్టించడం చాలా అవసరం. తల్లి పాలు తాగడం వల్ల పుట్టిన బిడ్డ రోగ నిరోధక చంటి పిల్లలకు శక్తి పెరుగుతుంది. కనుక బిడ్డకు కనీసం ఆరు నెలలు నిండే వరకైనా తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. మార్గదర్శకాల ప్రకారం 6 నెలల తర్వాత చనుబాలు మరిచి పోయేలా చేసి మరో ప్రత్నామ్నాయ ఆహారం ఇవ్వడం ప్రారంభించాలి. బిడ్డకు అవసరమైన పోషకాలు తల్లిపాల ద్వారా లభించాక, ఇతర ఆహారాల ద్వారా పిల్లలకు పోషకాలను అందించాలి.
తల్లి బిడ్డకు తన చను పాలు ఇవ్వడం వలన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. అంతేకాకుండా తల్లికి కూడా మేలు జరుగుతుంది. తల్లిపాలు పట్టించడం వల్ల శిశుకు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ. డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ప్రసవమయిన మొదటి రోజు నుండీ నాలుగు రోజుల వరకూ రొమ్ముల నుండీ చిక్కటి పసుపు పచ్చటి ద్రవం స్రవిస్తుంది. దీనిని కొలోస్ట్రమ్ లేదా ముర్రుపాలు” అంటారు. ఆ తర్వాతే తెల్లటి పాలు వస్తాయి. ఈ ముర్రుపాలు శిశువులకు చాలా ముఖ్యం, మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా బిడ్డకు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండవు. జీర్ణకోశ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చాలా తేలికగా అరుగుదల జరుగుతుంది. బిడ్డకు మలబద్దక సమస్య ఉండదు. తల్లిపాల వలన ఆస్తమా, చెవి సంబందించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తల్లిపాల వలన… స్థూలకాయం ఉండదని శాస్త్రవేత్తల పరిశోధన వలన తేలింది. తల్లిపాలు… పిల్లల దశలో లుకేమియా వ్యాధి రాకుండా, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి పెద్ద వయస్సులో రాకుండా కాపాడుతుంది. తల్లిపాలు పిల్లల తెలివి తేటలను పెంచుతుంది. తల్లి పాలలో చాలా ఫాటీ ఆసిడ్స్ ఉన్నందున, ఇవి పిల్లలలో మెదడు పెరుగుదలకు ఉపయోగ పడుతుంది. తల్లి పాలకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. తల్లి ఒడిలో బిడ్డ ఉన్నందున బిడ్డ చాలా అనుకూలమైన స్థితిలో ఉంటుంది. తల్లి బిడ్డల మధ్య బాంధవ్యం పెరుగుతుంది. అలాగే తల్లికి కల లాభాలలో తల్లిపాలు ఇచ్చినందు వలన తల్లికి ప్రసవానంతర సమయంలో బరువు తగ్గుటకు దోహద పడుతుంది. మానసిక వత్తిడిని తగ్గించి బాలింత దశలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి రాకుండా స్త్రీని కాపాడుతుంది. ఎంత ఎక్కువ కాలం తల్లి బిడ్డకు పాలు ఇస్తే అంత మంచిది. వ్యాధులు నుండి అంతే ఎక్కువ కాపాడుతుంది. ఆవు లేక గేదె పాలు తీసుకున్న పిల్లలు ఎక్కువ అలర్జీ సమస్యలకు గురి అవుతారు.