– నెదర్లాండ్స్‌తో వార్మప్ సైతం వర్షార్పణ
తిరువనంతపురం : ఐసీసీ ప్రపంచకప్ రెండు సార్లు చాంపియన్, ఆతిథ్య టీమ్ ఇండియా 2023 వన్డే వరల్డ్‌కప్ వేటను ప్రాక్టీస్ లేకుండానే ఆరంభించనుంది. ఆసియా కప్ విజయం అనంతరం స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తలపడిన రోహిత్‌సేన.. ప్రపంచకప్ వార్మప్ షెడ్యూల్‌లో భాగంగా ఇంగ్లాండ్, నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంది. కుండపోత వర్షంతో గువహటిలో ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్ టాస్ అనంతరం రద్దు కాగా.. తిరువనంత పురంలోనూ అదే కథ పునరావృత మైంది. ఎడతెరపి లేని వర్షంతో డచ్‌తో టీమ్ ఇండియా వార్మప్ సాధ్యపడలేదు. కనీసం టాస్ కూడా పడకుండానే.. మంగళవారం నాటి వార్మప్ మ్యాచ్ రద్దుగా ముగిసింది. ఐసీసీ ప్రపంచకప్‌లో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడనుండగా.. అక్టోబర్ 6న హైదరాబాద్‌లో పాకిస్థాన్‌తో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నేడు రోహిత్‌సేన చెన్నైకి చేరుకోనుండగా, డచ్ క్రికెటర్లు హైదరాబాద్‌కు రానున్నారు.
వార్మప్ లేకుండా..
ప్రపంచకప్ వేటను ప్రాక్టీస్ లేకుండా ఆరంభించటం టీమ్ ఇండియాపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. చివరగా సెప్టెంబర్ 27న భారత్ మైదానంలో కనిపించింది. సుమారు రెండు వారాల విరామం అనంతరం నేరుగా వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆడటం కాస్త ఇబ్బందికరమే కావచ్చు!. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగా కనిపిస్తున్నప్పటికీ.. భారీ స్కోర్లు నమోదయ్యే టోర్నీలో ఆతిథ్య జట్టుకు నం.8 బ్యాటర్ బలహీనత వేధిస్తోంది. జట్టులో అందరూ కుడి చేతి వాటం బ్యాటర్లే కావటం సైతం ఏ విధంగా ప్రభావం చూపనుందో మున్ముందే తెలియాలి.