కొందరికి పని తక్కువ మాటలు ఎక్కువ. వీళ్ళనే ‘మనిషి కడప దాటడు గాని- మాటలు కోటలు దాటుతాయి’ అంటరు. నేను ఇది చేస్తా, నేను అది చేస్తా.. అంటూ వాగుతుంటారు. ఇలాంటి వాళ్లను ‘ఏతులు ఎక్కువ కొడుతుండు’ అంటరు. ఈ సందర్భంగా వాడే సామెత ‘కూకుంటే లెవ్వ లేడు గాని.. ఎగిరెగిరి తాటికాయలు తంతాడట’ అంటారు. తాటి కాయలు ఎక్కడుంటాయి తాటి చెట్టు పైన ఉంటాయి. అక్కడికి కాలు లేపి తన్నడం అయ్యే పనేనా.. వీళ్ళకే మరొక సామెత ఉంది. ‘కూట్లే రాయ తీయనోడు ఏట్లే రాయి తీస్తాడట’ అని. అన్నం తినే పళ్ళెంలో రాయి తీయనివాడు ఏటిలోని రాయిని ఎలా తీస్తాడు. ఇట్లా ఏతులు ఎక్కువ మాట్లాడే వాళ్లను బుడ్డర్ఖాన్ అంటారు. ఇది ఒక జానపద కళ. కొందరికి సహజ సిద్ధంగానే ఉంటాయి. ‘కూటికి లేకున్నా కాటుక మానది’ అనే సామెత స్త్రీలను దష్టిలో ఉంచుకొని వాడుతారు.
ఎంటికలు ఉన్న అమ్మ కొప్పు ఎట్లేసినా అందమే. కొప్పు వేసుకుందామంటే వెంట్రుకలు లేకుంటే ఎలా? అలాంటి వాళ్లకు కూడా సౌరం ఉండనే ఉంటది. పిసినారుల గురించి ‘గుమ్మిల వడ్లు గుమ్మిలనే ఉండాలె గూటాలోలే బిడ్డలు ఉండాలె’ అంటారు. గూటాలు అంటే దొడ్డుగా అని అర్థంలో వాడుతారు. గుమ్మి అంటే వడ్లు నిలువ ఉంచేది. అంటే వడ్లు బియ్యం వినియోగంలోకి రావద్దు. కానీ అన్నం మాత్రం ఎలా తింటారు. ఇలాంటి వాళ్లకు కోపం కూడా ఎక్కువనే. మరొక సందర్భంలో ‘కూడు ఉడకలేదని కుండ పలుగ కొట్టిండట’ అంటారు. అన్నం ఉడకపోవడానికి కుండకు ఏమీ సంబంధం ఉండదు. కానీ ఆయన కోపం అట్లా ఉంది..
– అన్నవరం దేవేందర్, 9440763479