వయో వృద్ధులు లేని సమాజం వుండదు

There is no society without the elderly– విలువ, గౌరవం ఇచ్చినప్పుడే అది సార్ధకత
– జిల్లాలో వయవృద్ధులకు సంబంధించి 280 కేసులు
– త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ పూర్ణ చంద్ర
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వయో వృద్ధులు  లేని సమాజం ఉండదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ  జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవానికి అయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పెద్దల దినోత్సవం జరుపుకున్నంత మాత్రాన సరిపోదని, వారికి సరైన విలువ, గౌరవాన్ని ఇచ్చినప్పుడే అది సార్థకం అవుతుందని అన్నారు. మీరు లేని సమాజం ఊహించలేనిది. సమాజంలో మీది ఉత్కృష్ట భాగం.మీ కృషివల్లే సమాజం  కొనసాగుతోంది” అని ఆయన అన్నారు. సమాజానికి ప్రతి ఒక్కరు సేవ చేసినట్లుగానే వయోవృద్ధుల సేవను సైతం మర్చిపోలేమని తెలిపారు. కుటుంబ పెద్దలను గౌరవించుకోవాల్సిన బాధ్యత, వారిని గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.వయో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి 2007లో వచ్చిన చట్టం కొద్దిపాటి మాత్రమే ఉపశమనం కల్పించిందని చెప్పారు. జిల్లాలో వయవృద్ధులకు సంబంధించి 280 కేసులు నమోదయాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని తెలిపారు. మండల స్థాయిలో వయోవృద్ధుల కమిటీల ఏర్పాటు, వారికి చికిత్స తదితర విషయాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన వయోవృద్ధులను సన్మానించారు.వయో వృద్ధుల జిల్లా  అసోసియేషన్ తరపున స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను, అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ ఎస్ పి రాములు నాయక్, జిల్లా  సంక్షేమ అధికారి సక్కుబాయి, డిఆర్డిఏ అడిషనల్ పిడి శారద, వయోవృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున రావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  వయో వృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.