పార్టీ మారుతున్నామని వస్తున్న వార్తలలో వాస్తవం లేదు

-ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత..
 – రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి..
నవతెలంగాణ – నాంపల్లి: మునుగోడు శాసన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దగ్గరి బంధువు, నాంపల్లి ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, మండల రైతుబంధు సమితి కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి లు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని అవి తప్పుడు వార్తలని వారు ఖండించారు. తాము పార్టీ మారుతున్నామని తమపై తప్పుడు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. నాంపల్లి మండల కేంద్రంలో బుధవారం వారు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖల ప్రతినిధులతో కలిసి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో రానున్న సాధారణ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనలేక ప్రతిపక్ష పార్టీలు తమపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురిచేసి ఎన్నికలలో లబ్ధి పొందాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడద్దని, ఎలాంటి అయోమయానికి గురి కావద్దని బీఆర్ఎస్ పార్టీ నుండి తాము కానీ, ఏ ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి కేసీఆర్ ప్రకటించిన మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకై కృషి చేయాలని కోరారు. ఈ సమావేశం లో సర్పంచులు నాగులవంచ శ్రీలత, బల్గురీ విష్ణువర్థన్, రమావత్ రవి నాయక్, కుందారపు రమేశ్, అంధుగుల యాదయ్య, కోరే యాదయ్య, సపావత్ సర్దార్ నాయక్, జల్లళ్ళ సైదులు, దండిగా నర్సింహా, ఎంపీటీసీ బత్తుల వంశి, నాయిని శేఖర్ రెడ్డి, గాదెపాక రమేష్, ఎదుళ్ళ రాములు, గౌరు కిరణ్, గంజి సంజీవ, బొట్టు జగన్, ఎదుల్ల సుందర్, ఎదుళ్ల యాదగిరి, వట్టికోట నరేష్, బెల్లి సత్తయ్య, దుబ్బ జగన్, దాచేపల్లి పాండు తదితరులు పాల్గొన్నారు.