ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా…అభివృద్ధికైనా పరిశోధనలే కీలకం. అందుకే ప్రతీదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ శాఖ తప్పనిసరిగా ఉంటుంది. తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలతో భారతదేశం ప్రపంచంలోనే పేరుగాంచింది. కాలక్రమేణా దేశంలోని పరిశోధనలకు ప్రామాణికత తగ్గుతున్నది. దీనికి కారణం, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు. అధ్యాపకులు కేవలం ప్రమోషన్ల కోసం, విద్యార్థులైతే పీహెచ్‌డీల సబ్మిషన్ కోసమో ఐఎస్ఎస్ఎన్లో ప్రచురించు కోవడం వల్ల అసలైన పరిశోధకులకు తీవ్రనష్టం జరుగుతున్నది. ఒకవైపు అవగాహన లేకుండా, మరోవైపు త్వరితగతిన ప్రచురించుకోవాలనే ఉద్దేశంతో నకిలీ రీసెర్చ్ జర్నల్స్(ప్రిడియాట్రీ జర్నల్స్) యాజమాన్యాల మాటలు నమ్మి అందులో తమ విలువైన పరిశోధన పత్రాలను (రీసెర్చ్ పేపర్స్ లేదా రీసెర్చ్ ఆర్టికల్స్‌ను) ప్రచురి స్తున్నారు. దీనివలన వారిశ్రమతో పాటు ఆదాయం కూడా వృథా అవుతున్నది. ఆయా యూనివర్సిటీలకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు కూడా దక్కకుండా పోతున్నాయి.మరోవైపు కొంతమంది తూతూమంత్రంగా పరిశోధనలు చేస్తూ కేవలం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిరీస్ నెంబర్ (ఐఎస్ఎస్ఎన్) జర్నల్స్‌లో ప్రచురిస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన అండర్ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిజమైన పరిశోధకులు ఎంతో శ్రమించి పరిశోధన చేసి రాస్తున్న తమ పరిశోధన పత్రాలను ఎలాంటి ప్రామాణికత లేని, గుర్తింపులేని ఐఎస్ఎస్ఎన్ జర్నల్స్‌లో ప్రచురిస్తున్నారు. దీనివల్ల ఆ పరిశోధకులకే కాకుండా యూనివర్సిటీలకు చెడ్డపేరు వస్తున్నది. దీనికితోడు దేశానికున్న పేరు ప్రఖ్యాతలు కూడా నిలడటం లేదు. అంతేకాకుండా ఈ పరిశోధనా పత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒరిజినల్ పరిశోధకులు తమ రిఫరెన్స్‌గా చూసే అవకాశం లేకుండా పోతున్నది. అందువల్ల పరిశోధకులు గుర్తుంచుకోవాల్సిన అంశమేమిటంటే ఐఎస్ఎస్ఎన్ నెంబర్‌తో పాటు ఆ రీసెర్చ్ జర్నల్స్ స్కోపస్, యూజీసీ కేర్ లేదా వెబ్ఆఫ్ సైన్స్ , పీర్‌రివ్యూ మొదలైన వాటి లిస్టులో ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ లిస్టులో ఉన్న రీసెర్చ్ జర్నల్స్‌లో మాత్రమే నిజమైన పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను ప్రచురించుకోవాలి. అంతేకాదు ఆ జర్నల్స్‌లో పలుమార్లు సమీక్షలు చేసిన తర్వాతనే అలాంటి ఆర్టికల్స్‌ను ప్రచురిస్తున్న పరిస్థితి ఉంది. సదరు రీసెర్చ్ ఆర్టికల్ ఒరిజినల్ కాదని ఆ కమిటీ పరిశీలించినప్పుడు, అలాంటి నకలీ ఆర్టికల్స్‌కు ప్రచురించే అవకాశం ఉండదు. గనుక అధ్యాపకులైనా, పరిశోధక విద్యార్థులైనా పరిశోధనలు చేస్తున్నప్పుడు, ఆర్టికల్స్ ప్రచురిస్తున్నప్పుడు వాస్తవాల ఆధారంగానే తమ ఆర్టికల్స్‌ను ప్రచురించుకోవాలి.
స్కోపస్, యూజిసి-కేర్, వెబ్ ఆఫ్ సైన్సెస్, పీర్ రివ్యూ మొదలైన వాటి లిస్టులో ఉన్న రీసెర్చ్ ఆర్టికల్‌కు మాత్రమే మార్కులుంటాయి. ప్రపంచ స్థాయిలో విశ్వవిద్యాలయాలతో పాటు వివిధ సంస్థలకు వాటి పరిశోధనా ప్రమాణాల ఆధారంగా ఇచ్చే క్యూఎక్స్ ఇండెక్స్ ర్యాంకులు కానీ జాతీయస్థాయిలో భారత ప్రభుత్వం ఇచ్చే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు కానీ స్కోపస్ లేదా, యుజిసి కేర్, వెబ్ ఆఫ్ సైన్సెస్ లాంటి మొదలైన రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైనప్పుడే దక్కుతాయి. వ్యక్తికైనా, వ్యవస్థకైనా, దేశానికైనా, యూనివర్సిటీ కైనా, ఇలాంటి ఉన్నతమైన ప్రమాణాలతో అందిస్తున్న ర్యాంకులే కీలకం. ఈ ర్యాంకుల ఆధారంగానే ప్రపంచ స్థాయిలోగానీ, జాతీయస్థాయిలోగానీ, వివిధ ప్రభుత్వాలు సంస్థలు పరిశోధనలు చేయడానికి ఉదారంగా నిధులను ఆయా వ్యక్తిగత పరిశోధకులకు లేదా సంస్థలకు లేదా యూనివర్సిటీలకు అందిస్తాయి. దీంతో భారత దేశ పరిశోధన ప్రస్థానం మరింత ముందుకు సాగుతూ మనదేశ యూనివర్సిటీలకు, వివిధ సంస్థలకు మంచిర్యాంకులు, మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది.
పరిశోధనలతోనే ఏదైనా కనుగొనడం, పరిశోధన నుండి ప్రగతి, పరిశోధనలతోనే సామాజిక మార్పు, ప్రభుత్వాలు పాలసీలు చేయడానికి పరిశోధన ఫలాలే. అందువల్ల నిజమైన పరిశోధనలు చేస్తున్న వారిని ప్రోత్సహించడానికి ఆర్టికల్ పబ్లికేషన్ చార్జెస్ (ఏపిసి)సహకారం ఉండాలి. స్కోపస్, యుజిసి కేర్, వెబ్ ఆఫ్ సైన్సెస్, పీర్ రివ్యూ లాంటి మొదలైన రీసర్చ్ జర్నల్స్‌లో అధ్యాపకులు లేదా రీసెర్చ్ స్కాలర్స్ లేదా పరి శోధకులు తమ పరిశోధన పత్రాలను ప్రచురించుకోవాలనుకున్నప్పుడు ఆయా రీసెర్చ్ జర్నల్స్ ఆర్టికల్ పబ్లికేషన్ ఛార్జెస్ అడుగుతున్నారు. స్కోపస్ లాంటి జర్నల్స్‌లో తమ రీసెర్చ్ ఆర్టికల్స్‌ను పబ్లిక్ చేసుకోవాలంటే 300 డాలర్ల నుంచి నుంచి 10వేల డాలర్ల వరకు అంటే, మన లెక్కలో రూ. 25 వేల నుంచి 9 లక్షల వరకు ఏపీసి చార్జీలను వసూలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్కోపస్ జనరల్స్ ఒక్కో జర్నల్ ఒక్కోరకంగా చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇలాంటప్పుడు లక్షల్లో రూపాయలు వెచ్చించి ఆయా రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించే ఆర్థిక స్థోమత ఎంతోమంది పరిశోధకులకు లేదు. గనుక పరిశోధనలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు లేదా ఆయా సంస్థలు, యూనివర్సిటీలు పరిశోధకులకు ఏపీసీ చార్జీల సహకారం తప్పనిసరి. ఈ పబ్లికేషన్స్‌తో ఆయా వ్యక్తులకే కాకుండా సంస్థలకు, యూనివర్సిటీలకు మంచిర్యాంకులు వస్తాయి. తద్వారా కోట్లాది రూపాయలను వివిధ ఫండింగ్ ఏజెన్సీల నుంచి వివిధ సంస్థలు లేదా యూనివర్సిటీలు పొందే అవకాశం ఉంటుంది. మళ్లీ ఈ డబ్బుల్ని తిరిగి పరిశోధనలకు వెచ్చించడానికి అవకాశమూ లేకపోలేదు. ఇది దేశాన్ని, దేశప్రగతిని ఎంతో ఉన్నత స్థానంలో ఉంచుతుంది.
కేవలం ఐఎస్ఎస్ఎన్ నెంబర్ ఉన్న కొన్ని రీసెర్చ్ జర్నల్స్ స్కోపస్‌లో లేకున్నా యూజీసీ కేర్ లిస్టులో లేకున్నప్పటికీ ఆ లిస్టులో తమ జర్నల్స్ ఉన్నాయని ఆ జర్నల్స్ వెబ్సైట్లో పెట్టుకుని పరిశోధకులను మోసం చేస్తున్నాయి. కేవలం లాభార్జన ధ్యే యంగా పరి శోధనా పత్రాలను ఈ జర్నల్స్ ప్రచురిస్తున్నాయి. ఒకవైపు నకిలీ పత్రాలను ప్రచురించడం, మరోవైపు నిజమైన పరిశోధకులను కూడా మోస గించడం ఈ జర్నల్స్ నిర్వాహకులు చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి జర్నల్స్‌పై యుజిసి నిరంతరం నిఘా పెట్టి వాటిపై సరైన చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉన్నది. స్కోపస్, యుజిసి కేర్, వెబ్ ఆఫ్ సైన్సెస్, పీర్ రివ్యూ లాంటి మొదలైన రీసెర్చ్ జర్నల్స్‌లో మాత్రమే పరిశోధకులు ప్రచురించుకోవాలని, వాటికే గుర్తింపు ఉంటుందని, వాటికే అధ్యాపక నియామకాల్లో, ప్రమోషన్లలో మార్కులు ఉంటాయని అధ్యాపకులకు, రీసెర్చ్ స్కాలర్స్‌కు విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఆయా యూనివర్సిటీల పైన ఎంతగానో ఉన్నది. అంతేకాదు, ఇది రీసెర్చ్ సూపర్‌వైజర్స్‌గా ఉండే అధ్యాపకుల బాధ్యత కూడా.
– కత్తెరసాల శ్రీనివాస్, 8121184095