పాలస్తీనాను వీడి వెళ్ళేది లేదు ఇజ్రాయిల్‌పై ఆంక్షలు విధించండి

There is no leaving Palestine Sanctions against Israel– ఐరాస నుంచి బహిష్కరించండి
– ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌ స్పష్టీకరణ
– గాజా పునర్వ్యవస్థీకరణకు 12 సూత్రాల ప్రణాళిక
ఐక్యరాజ్య సమితి : ”పాలస్తీనా మా మాతృభూమి, మేం ఆ ప్రాంతాన్ని వీడి వెళ్ళం. వెళ్ళాల్సిన వారు ఎవరైనా వున్నారు అంటే, వారు దురాక్రమణకు పాల్పడినవారే.” అని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 79 వ వార్షిక సమావేశాల్లో ప్రసంగించారు. ఈ విషయంలో ఆయనకు పలు దేశాల నేతలు తమ మద్దతు పునరుద్ఘాటించారు. .
ఇజ్రాయిల్‌ పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతూ పాలస్తీనియన్లను ఊచకోత కోస్తోందని ఆయన విమర్శించారు. గాజాలో అమాయకులైన పౌరులను చంపలేదని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు అనడాన్ని ఆయన తోసిపుచ్చారు. అలా అయితే 15వేల మందికి పైగా చిన్నారులను పొట్టనబెట్టుకున్నారు, మరి వారెవరు? అని ప్రశ్నించారు.
”ఈ నేరాలు ఆపండి, ఇప్పుడే ఆపాలి. మహిళలను, చిన్నారులను చంపడాన్ని మానాలి. ఊచకోతకు స్వస్తి పలకాలి. ఇజ్రాయిల్‌కు ఆయుధాలు పంపించడం ఆపాలి. ఇవన్నీ కొనసాగించడం ఇకపై కుదరదు. ఈనాడు మా ప్రజలకు జరుగుతున్నదానికి యావత్‌ ప్రపంచం బాధ్యత వహించాలి.” అని అబ్బాస్‌ స్పష్టం చేశారు.
ఇజ్రాయిల్‌పై ఆంక్షలు విధించాలని, ఐక్యరాజ్య సమితి నుండి బహిష్కరించాలని అబ్బాస్‌ అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈ ప్రపంచ సంస్థలో భాగస్వామి కావడానికి ఇజ్రాయిల్‌కు అర్హత లేదని అన్నారు. ఈ అంశంపై యుఎన్‌జిఎకు పిటిషన్‌ను అందచేయనున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికా ఇప్పటికి మూడుసార్లు భద్రతా మండలిలో కాల్పుల విరమణ ముసాయిదా తీర్మానాలను అడ్డుకోవడం విచారకరమని అన్నారు. వీటో అధికారంతో తీర్మానాలను వీగిపోయేలా చేస్తూ, మరోపక్క ఇజ్రాయిల్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూ అమెరికా, ఇజ్రాయిల్‌ చర్యలను సమర్ధిస్తోందన్నారు.
ఆక్రమి వెస్ట్‌ బ్యాంక్‌లో ప్రస్తుతం ఆరులక్షల మందికి పైగా సెటిలర్లు వున్నారన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు కావాలని కోరుతున్నామన్నారు.
12 సూత్రాలతో దార్శనికత
గాజాలో ఇజ్రాయిల్‌ దాడులనంతర పరిస్థితులను చక్కదిద్దడానికి అబ్బాస్‌ 12 సూత్రాలను ప్రతిపాదించారు.
గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, హింసకు పూర్తిగా స్వస్తి చెప్పడంతో పాటూ రెండు దేశాలు ఏర్పాటు పరిష్కారాన్ని అమలు చేసేందుకు ఏడాదిలోగా అంతర్జాతీయ శాంతి మహాసభను నిర్వహించాలని ప్రతిపాదించారు. అలాగే ఇరు దేశాల్లో ప్రజల రక్షణ కోసం అంతర్జాతీయ శాంతి పరిరక్షక బలగాలను ఏర్పాటు చేయాలన్నారు. తాము ప్రతిపాదించిన 12 సూత్రాలను అంతర్జాతీయ సమాజం సమీక్షించవచ్చని, అవసరమైతే సవరణలు చేయవచ్చని అబ్బాస్‌ సూచించారు.
పాలస్తీనాలో శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని గాంబియా అధ్యక్షుడు అడమా బారో కోరారు.