భాగస్వామితో ఎంత ప్రేమగా ఉంటే ఇద్దరి మధ్య రిలేషన్ అంత చక్కగా ఉంటుంది. మనం వారిని ఎంత ఇష్టపడుతున్నామో తెలియజేసేది కూడా ఇదే. ప్రేమ జంటల మధ్య బంధాన్ని దృఢంగా ఉంచుతుంది. శారీరకంగా ఇద్దరూ సంతోషంగా ఉంటే మానసికంగా కూడా ఆనందంగా ఉంటారు. ఆనందం అంటే కేవలం శారీక కోర్కెలు తీర్చుకోవడం మాత్రమే కాదు. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకోవడం, అక్కున చేర్చుకోవడం, ఒకరినొకరు పొగుడుకోవడం, కౌగిలించు కోవడం, సున్నితంగా తాకడం వంటివి కూడా ఇందులో భాగమే. ప్రేమగా ఉండటానికి, శారీక కోర్కెలు తీర్చుకోడానికి మధ్య చాలా తేడా ఉంది. ఆ తేడా తెలియక గందరగోళ పడే జంట కథే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
కమల్‌కు సుమారు 28 ఏండ్లు ఉంటాయి. లక్ష్మితో వివాహమై మూడేండ్లు అవుతుంది. తల్లిదండ్రులు ఊళ్లో ఉంటారు. వీరిద్దరే ఉద్యోగరీత్యా సిటీలో ఉంటున్నారు. పిల్లలు లేరు. పెండ్లప్పుడు రెండేండ్ల తర్వాత పిల్లల కోసం ఆలోచించాలని అనుకున్నారు. అయితే ఇప్పటికీ మూడేండ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదు. కానీ దీని గురించి వారికి పెద్దగా ఆలోచనలేదు. పెద్దవాళ్ల ఒత్తిడి మాత్రం పెరిగింది. ఈ ఒక్క సమస్యే కాదు ఇద్దరి మధ్య మరో సమస్య కూడా ఉంది. లక్ష్మికి రొమాంటిక్‌గా మాట్లాడితే నచ్చదు. అదేదో బూతుపదంగా అనుకుంటుంది. కమల్ ఏదైనా సరదాగా ఆమెతో అంటే ‘ఏంటి బూతులు మాట్లాడతావు, ఎక్కడి నుండి నేర్చుకున్నావు’ అని కోప్పడుతుంది.
కమల్‌కి మాత్రం తన భార్యతో ప్రేమగా మాట్లాడటమంటే చాలా ఇష్టం. తన చేత్తో ఐస్‌క్రీం తినిపించమన్నా ఏదో తప్పు చేస్తున్నట్టు అనుకుంటుంది. ‘నువ్వు ఇలా రెడీ అయితే బాగుంటావు’ అని ప్రేమగా అన్నా అది కూడా తప్పుగా భావిస్తుంది. ప్రేమగా ‘ఏమైనా తీసుకురమ్మంటావా’ అన్నా తిడుతుంది. ఇలా అతను మాట్లాడినా, మాట్లాడకపోయినా కోపగించుకుంటుంది. దాంతో కమల్ అసలు ఆమెతో మాట్లాడటమే తగ్గించేశాడు. ఎప్పుడైనా పగటి పూట అతను ఆమెను దగ్గరకు తీసుకుంటే ఇలాంటి పనులు రాత్రిపూటే చేయాలి అంటుంది. కనీసం ముద్దు కూడా పెట్టుకోనివ్వదు, కౌగిలించుకో నివ్వదు. అతను కాస్త గట్టిగా అడిగితే ‘మీకెప్పుడూ ఇదే పిచ్చా’ అంటూ చిరాగ్గా చూస్తుంది. ఈ విషయాలన్నీ ఎవరితో పంచుకోవాలో తెలియక కమల్ లోలోపలే సతమత మవుతున్నాడు.
ఎప్పుడైనా వాళ్ళ పుట్టింటికి వెళ్లినా ఫోన్ చేసి ప్రేమగా పలకరించదు. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి ‘తిన్నారా? ఏం చేస్తున్నారు?’ అంటుంది. ఇంకో మాట మాట్లాడే అవకాశమే ఇవ్వదు. ఇద్దరం కలిసి సరదాగా బయటకో, సినిమాకో వెళదామంటే ఒప్పుకోదు. ‘నీతో బయటకు వస్తే నాకు అదో రకంగా ఉంటుంది’ అంటుంది. పక్కన భార్యను పెట్టుకొని చూడకుండా, మాట్లాడకుండా ఎలా ఉండాలనేది అతని బాధ. ఇలాంటి సమస్యతోనే అతను మా దగ్గరకు వచ్చి తన భార్యకు అర్థమయ్యే విధంగా చెప్పమన్నాడు.
మేము ఫోన్ చేసి లక్ష్మిని పిలిపించి కమల్ చెప్పిన విషయాల గురించి ఆమెతో మాట్లాడితే ‘రొమాన్స్, సెక్స్ వంటి బూతు పదాల గురించి మీరెలా మాట్లాడుతున్నారు. మా ఇంట్లో ఇలాంటి పద్ధతి లేదు. బహిరంగంగా సెక్స్ గురించి మాట్లాడుతున్నారు. కమల్ మీ దగ్గరకు వచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు’ అని చెప్పుకొచ్చింది.
దాంతో మేము ‘సెక్స్‌కి, రొమాన్స్‌కి చాలా తేడా ఉంది. భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రేమగా ఉండటం రొమాన్స్. అయినా ఇవేవీ బూతు పదాలు కావు. మనిషి జీవితంలో సహజం. గాలి, నీరు, ఆహారం, నిద్ర మన జీవితానికి ఎంత అవసరమో ఇది కూడా అంతే. ముందు దీన్ని అర్థం చేసుకో. స్త్రీ,పురుషులు శారీరకంగా కలవడాన్ని సెక్స్ అంటారు. మీ మధ్య రొమాటింగ్ రిలేషన్ ఉంటే మీ జీవితం సంతోషం గా ఉంటుంది. లేదంటే యాత్రికంగా గడిచిపో తుంది. జీవితం పట్ల బోర్ కొడుతుంది. ఇలాంటి బంధం మీ ఇద్దరి జీవితానికి చాలా అవసరం.
ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలన్నా, ఏ విషయమైనా కంగారు లేకుండా, మోహమాటం లేకుండా మాట్లాడుకోవాలంటే ఇలాంటి రొమాంటిక్ రిలేషన్ భార్యాభర్తల మధ్య కచ్చితంగా ఉండాలి. ఈ రిలేషన్ లేకపోతే సహజంగానే కోపం, చిరాకు, ఆందోళన పెరుగుతాయి. అందుకే మీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. కమల్‌కు నువ్వుంటే చాలా ఇష్టం. నీతో ఎంతో ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వేమో బూతు అంటూ పక్కన పెడుతున్నావు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోవడం తప్పేం కాదు. భార్యా భర్తల మధ్య ఇలాంటి చర్చలు జరగాలి. అప్పుడే ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండగలరు. కానీ మన సమాజంలో దీన్ని తప్పుగా భావిస్తున్నారు. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే కమల్ నీకు తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తే ఏం చేస్తావు. అనవసరంగా నీ జీవితంలో నువ్వే సమస్యలు తెచ్చుకుంటున్నావు. పరిస్థితి అంత దూరం తెచ్చుకోకు.
అతని ప్రవర్తనలో ఏదైనా ఇబ్బంది కరంగా ఉంటే సున్నితంగా చెప్పు. మరీ కష్టంగా ఉంటే మాతో అయినా చెప్పొచ్చు. అంతే కాని అతను దగ్గరకు వస్తున్నపుడు నువ్వు దూరం పెట్టడం సరైనది కాదు. మీకు ఇంకా పిల్లలు లేరు. కాబట్టి ఇప్పుడే జీవితాన్ని సరదాగా గడపాలి. రేపు పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగో ఆ అవకాశం పెద్దగా ఉండదు’ అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాము.
మేము మాట్లాడిన తర్వాత ఆమె కాస్త ఆలోచనలో పడింది. మాట్లాడే విధానంలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది. రెండు వారాల తర్వాత లక్ష్మిని తీసుకొని కమల్ వచ్చి ‘మేడమ్ చాలా సంతోషంగా ఉంది. లక్ష్మి అంతకు ముందులా లేదు. నాతో ప్రేమగా ఉంటుంది’ అని చెప్పాడు. లక్ష్మి కూడా ‘ఇప్పుడు నాకూ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది మేడమ్. కమల్ చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య అంతకు ముందులా గొడవలు కూడా లేవు. పిల్లల కోసం కూడా ప్లాన్ చేసుకుంటున్నాం’ అని సంతోషంగా చెప్పింది.
– వై వరలక్ష్మి,
9948794051