విద్యావిధానంలో మార్పు రావాలి

– ఎస్టీయూ కార్యవర్గ సమావేశంలో విద్యా కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే తెలంగాణ విద్యా విధానంలో మార్పు రావాలని విద్యా కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కాచిగూడలో ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో వివిధ సమస్యలున్నాయనీ, అవి తన దృష్టికి వచ్చాయని చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో సమస్యలపై సంప్రదింపులు చేపడతామని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పర్వత్‌రెడ్డి, జి సదానందంగౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని కోరారు. ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.
సర్వీసు నిబంధనలను సాధించి, ఎంఈవో, డిప్యూటీఈవో, డైట్‌, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
317 జీవోపై నియమించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ద్వారా త్వరితగతిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు బదిలీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్సీ నియామకాలు పూర్తయిన వెంటనే, బదిలీ అయిన ఎస్జీటీ ఉపాధ్యాయులను రిలీవ్‌ చేయాలని చెప్పారు. ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్టీ ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులతోపాటు, మినిమం టైం స్కేల్‌ను మంజూరు చేయాలని అన్నారు. పీఆర్సీ గడువు ముగిసి ఏడాది గడిచిందనీ, వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలనీ, సీపీఎస్‌ రద్దు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య, నాయకులు ఎల్‌ఎం ప్రసాద్‌, జుట్టు గజేందర్‌, పోల్‌ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఎం శంకర్‌, శీతల్‌ చౌహాన్‌, శిరీష, రంగారావు, బి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.