కృష్ణా జలాలపై లాభం కలిగేలా చర్చ ఉండాలి

కృష్ణా జలాలపై లాభం కలిగేలా చర్చ ఉండాలి– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా కాకుండా లాభం చేకూరేలా అసెంబ్లీలో చర్చ జరగాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు కడియం శ్రీహరి సూచించారు. కృష్ణాజలాలపై చర్చ సందర్భంగా ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. తమ నాయకుడు సభకు రాలేదని పదేపదే అనటం సరిగాదన్నారు. తాము మాట్లాడుతున్నదంతా బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫుననే అని స్పష్టం చేశారు. ‘ఏ ఊకోవయ్యా..ఎందుకొర్లుతున్నవ్‌..నీవు హోం మినిష్టర్‌ అయ్యేది లేదు..చచ్చేది లేదు’ అంటూ మధ్యలో జోక్యం చేసుకున్న రాజగోపాల్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నామని తెలిపారు. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌పై పలు సూచనలు చేస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలను రెండు రాష్ట్రాల మధ్య విభజించటానికి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు అప్పగిం చిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలో మన ప్రభుత్వ వాదనలను వినే అవకాశముందని చెప్పారు. ట్రిబ్యునల్‌ అవార్డు ఉండగానే రాష్ట్రాలు కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుంటాయనీ, నిర్మాణంలో ఉన్న, అనుమతి ఉన్న, అనుమతిల ేని ప్రాజెక్టులకు క్లయిమ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తుచేశారు. ట్రిబ్యునల్‌ ముందు మన వాదనలను పెట్టాలనీ, ఎక్కువ వాటా కోసం పట్టుబ ట్టాలని సూచించారు. రెండు రాష్ట్రాల పంచాయతీని అడ్డం పెట్టుకుని కేంద్రం పెత్తనాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి బోర్డులను ఏర్పాటు చేసిందన్నారు. త్వరగా బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును ఇవ్వాలనీ, నీళ్ల కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సార్‌..ఆ రెండ్రోజులు అసెంబ్లీ పెట్టొద్దు : మల్లారెడ్డి
‘నాదేం లేదు సార్‌. ఒకటే నిమిషం సార్‌. సార్‌ సార్‌ ఒకటే సెకండ్‌. అధ్యక్షునికి విన్నపం చేస్తున్నా. ఈ నెల 14, 15 తేదీల్లో వసంత పంచమి ఉంది. ఆ రోజు 26 వేల పెండ్లీండ్లు ఉన్నాయి. దయచేసి ఆ రెండ్రోజులు అసెంబ్లీ పెట్టొద్దు సార్‌. ఇంతేసార్‌’ అని బీఆర్‌ఎస్‌ సభ్యులు చామకూర మల్లారెడ్డి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు విన్నవించారు.