– పొన్నాల లక్ష్మయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సాగు, తాగునీటిపై కాంగ్రెస్ నేతలు ముఖాముఖి చర్చకు రావాలని బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య సవాల్ చేశారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పర్యటనకు వెళ్లొచ్చేలోపు గాయత్రి పంప్ హౌజ్ నుంచి నీళ్లను వదిలారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 48 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కేసీఆర్ సింహం లెక్కన కదిలారరని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతంకాదనీ, ఆరు నెలల్లో పరిస్థితి అటు, ఇటు కావచ్చని తెలిపారు. రేవంత్‌కు దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, హౌమ్ సెక్రెటరీని విచారణ చేయాలని డిమాండ్ చేశారు.మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి.. తాటాకు సప్పుడుకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పోన్ ట్యాపింగ్ ప్రభుత్వానిదా? లేక ప్రయివేటుదా? తేల్చాలని డిమాండ్ చేశారు. మాజీ డీజీపీలను ఎందుకు విచారించడం లేదని కిషోర్ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ దక్షిణ భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ మూడు సార్లు వరసగా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని అనుకున్నా… వంద రోజుల్లోనే కాంగ్రెస్ ఫెయిల్యూర్ ప్రభుత్వంగా నిలిచిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో యాసంగి సీజన్‌లో 20 లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.