– ఎన్టీఏను రద్దు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నీట్ అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమయంలో నీట్ ఫలితాలను ప్రకటించిందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 14న ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా, పది రోజుల ముందుగానే ప్రకటించడంపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఎన్టీఏ వచ్చినప్పటి నుంచి దాని పారదర్శకతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. గత పరీక్షల్లో అది చేసిన తప్పిదాలు, అవకతవకలు పునరావృతమవుతున్నాయని తెలిపారు. నీట్ పరీక్ష 720 మార్కులకు నిర్వహించారని వివరించారు. గణితంలోనే పూర్తి మార్కులను సాధించడం సాధ్యం కాదనీ, అలాంటిది నీట్‌లో 720కి 720 మార్కులొచ్చాయని పేర్కొన్నారు. దీనిపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యాకేంద్రీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేపడతామని తెలిపారు. నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కోరారు. నీట్ అవకతవకలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : ఏఐఎస్‌ఎఫ్
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఏ నిర్వహించిన నీట్ రాతపరీక్ష, ఫలితాలపై అనేక అనుమానాలున్నాయని తెలిపారు. ఈ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 720కి 720 మార్కులు రావడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి : పీడీఎస్‌యూ
నీట్ యూజీ పరీక్ష ఫలితాల అవకతవకలపై లోతుగా విచారణ జరపాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ రాతపరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరారు. ఆ ఫలితాలపై అనేక అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయని తెలిపారు. ఈ ఫలితాల్లో 62 మందికి 720కి 720 మార్కులు రావడం, ఒకే కేంద్రంలో ఎనిమిది మందికి పూర్తి మార్కులు రావడం, గ్రేస్ మార్కులు కేటాయించిన తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. గుజరాత్ కేంద్రంగా ఒక కన్సల్టెన్సీ సంస్థ ఒక్కో విద్యార్థి నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని నీట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్టు వార్తలొచ్చాయని తెలిపారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.