చట్టసభల్లో కమ్యూనిస్టులుండాలి

There should be communists in the legislatures– బీఆర్‌ఎస్‌ అభివృద్ధి మేడిపండు చందం
– బీజేపీ మతోన్మాదం ప్రమాదకరం
– కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్‌ ఎందుకివ్వాలి
– కార్మిక పక్షపాతి సీపీఐ(ఎం)ను గెలిపించండి : ఇస్నాపుర్‌ బహిరంగ సభలో జాతీయ నాయకులు సాయిబాబు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
కార్మిక వర్గం, పేదల కడుపులు నింపే ఎర్రజెండా కావాలా.. ప్రజలను దోచుకునే బీఅర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ దోపిడీదారులు కావాలా అనేది ప్రజలు ఆలోచించుకొని ఓటేయాలని సీపీఐ(ఎం) జాతీయ నాయకులు సాయిబాబు కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి మల్లికార్జున్‌ గెెలుపు కోసం మంగళవారం ఇస్నాపూర్‌ చౌరస్తాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆకాశవాద బీఆర్‌్‌ఎస్‌, అవినీతి కాంగ్రెస్‌, మతోన్మాద బీజేపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. వీళ్లంతా గడిచిన పదేండ్లలో ఏనాడూ కార్మికులు, శ్రామికులు, పేద ప్రజల కష్టాల గురించి పట్టించుకున్న పాపన పోలేదన్నారు. సీపీఐ(ఎం) మాత్రం కార్మికులు, పేదల పక్షాన నికరంగా నిలబడి పోరాటాలు చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ చెబుతున్న అభివృద్ధి మేడిపండు చందంగా ఉందన్నారు. కోటి మంది కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల అమలు గురించి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని, దాని వల్ల కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న పరిశ్రమల్లో కార్మికుల కష్టాలనూ తీర్చేలేదన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ, అంగన్వాడీ, ఆశా, జీపీ, మున్సిపల్‌ ఇలా అనేక రకాల కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వందకు పైగా సమ్మె పోరాటాలు నిర్వహించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పైగా సమ్మె చేసే వారితో తాను మాట్లాడబోనని, అధికారులు, మంత్రులు చర్చలు కూడా జరపకూడదని చెప్పిన కేసీఆర్‌కు ఎందుకు కార్మికవర్గం ఓటేయాలో చెప్పాలని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నీరో చక్రవర్తి లాంటి కేసీఆర్‌ నియంతల పాలనను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, ఎంఐఎంతో జతకట్టిన బీఆర్‌ఎస్‌ జీఎస్టీ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ఆనాడు సీపీఐ(ఎం) మాత్రమే అసెంబ్లీలో జీఎస్టీ బిల్లును వ్యతిరేకించగా, బీఆర్‌ఎస్‌ మాత్రం సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. పదేండ్ల తర్వాత ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు కేంద్రం నుంచి నిధులు రావడం లేదంటూ ఓ పెద్ద బిచ్చగాడిలా నిధులివ్వండీ అంటూ అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను తెగ నమ్ముతున్న బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ఏనాడు పోరాడింది లేదన్నారు. సీపీఐ(ఎం) మాత్రం బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కొడుతూ ఉద్యమించిందన్నారు. పదేండ్లు అధికారం లేని కాంగ్రెస్‌ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బావిలో కప్పలా ఉండిపోయిన కాంగ్రెస్‌ ఈ పదేండ్లలో ఏనాడైనా కార్మికుల వేతనాలు, కష్టజీవులకు సమస్యలపై మాట్లాడింది లేదని తెలిపారు. రాష్ట్రంలో 150 ప్రాంతాల్లో పేదలు ఇండ్ల స్థలాల కోసం పోరాడి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే అధికార పార్టీ వాటిని పోలీసుల చేత జులుం ప్రదర్శించి వేసిన గుడిసెలను కూల్చివేసిందని గుర్తుచేశారు. పాలక పార్టీలు చెప్పే అభివద్ధి అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అభివృద్ధి చెందడం.. రియల్‌ ఎస్టేట్‌ దందాలు పెరగడం కాదన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, కనీస సదుపాయాల కల్పన, వేతనాల పెంపు, ధరల నియంత్రణ, అందరూ గౌరవంగా జీవించడం కోసం పరిపాలన చేయడమే నిజమైన అభివృద్ధి అని తెలిపారు. అందుకే ఎర్రజెండా అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు ఆలోచించి వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుడు సైతం పోటీ చేసి గెలిచేలా కల్పించబడిన ఓటు హక్కును పాలక పార్టీలు ధన రాజకీయాలు చేస్తూ ఓటును ‘సరుకు’ గా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మైపాల్‌ రెడ్డి యాజమాన్యాలకు వత్తాసు పలకడం తప్ప కార్మికుల వేతనాలు, కష్టాల గురించి ఏనాడూ మాట్లాడలేదన్నారు. కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లికార్జున్‌ను గెలిపించుకోవడం ద్వారా పటాన్‌చెరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి మల్లికార్జున్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి పాలక పార్టీలే కారణమన్నారు. సభలో ఆ పార్టీ నాయకులు బీరం మల్లేశం, వాజీద్‌్‌ అలీ, పాండురంగారెడ్డి, రాజారెడ్డి, నాగేశ్వర్‌రావు, వీఎస్‌రాజు, అనంతరావు, సంతోష్‌కుమార్‌గౌడ్‌, నాగప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.