కోరుకున్న విద్య చదువుకునే స్వేచ్ఛ ఉండాలి

There should be freedom to pursue desired education– విద్యార్థుల ఇష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి
– అందరికి విద్యనందించటంలో ఓపెన్‌ వర్సిటీ పాత్ర కీలకం: యూజీసీ చైర్మెన్‌ జగదీష్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యార్థులకు తాము కోరుకున్న విద్యను అభ్యసించే స్వేచ్ఛ ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చైర్మెన్‌ జగదీష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఒక కోర్సును ఎంపిక చేసుకున్న తర్వాత తమ అభీష్టం మేరకు మరో కోర్సులోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించే విద్యార్థుల ఇష్టాలను విద్యాలయాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఒకే సమయంలో పలు కోర్సులను చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించాలి. రెగ్యులర్‌ విద్యార్థులు ఓపెన్‌ విద్యా విధానంలోకి, అదే విధంగా ఓపెన్‌ విద్యా విధానంలోని వారు రెగ్యులర్‌ విద్యార్థులుగా మారేందుకు అవకాశమివ్వాలని సూచించారు. ఉన్నత విద్యలో సంస్కరణలు, 2017 యూజీసీ రెగ్యులరేషన్స్‌ అమల్లోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయని ఆయన చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 25వ స్నాతకోత్సవంలో జగదీష్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 43 మందికి గోల్డ్‌ మెడల్స్‌ను, 31,729 మందికి డిగ్రీ, డిప్లొమా పట్టాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మారుమూల గ్రామీణ ప్రాంతాల వారు, గృహిణులు, ఆటోడ్రైవర్లు, ఖైదీలు పట్టాలు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల స్నాత కోత్సవాల్లో తాను పాల్గొన్నప్పటికీ, ఇంతటి వైవిధ్యం ఎక్కడా చూడలేదని తెలిపారు. ఇలాంటి వారు విద్యావంతులైతే వారి సామాజిక, ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుందని తెలిపారు. తద్వారా దేశం అభివృద్ధి చెందు తుందని చెప్పారు. ఓపెన్‌ యూనివర్సి టీ మారుమూల ప్రాంతాల వారికి నాణ్యమైన విద్యను అందిస్తుండటాన్ని ఆయన అభినం దించారు. అపజయా లకు కుంగిపోవనవసరం లేదనీ, అక్కడి నుంచే విజయానికి బాటలు వేసుకో వాలని జగదీష్‌ కుమార్‌ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. పౌరాణిక గాథలో భగీరథుడు గంగను భూమికి రప్పించేందుకు ప్రదర్శించిన పట్టుదల మాదిరి ప్రతి విద్యార్థి తపనను కలిగి ఉండాలని సూచించారు. ప్రపంచం లో ఉద్యోగాల కల్పన పరిస్థితులు మారి పోయాయని చెప్పారు. ఏ యూనివర్సిటీ నుంచి పట్టా తీసు కున్నాం.. ఏ విధా నంలో విద్యనభ్య సించామనే విషయా లను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేద న్నారు. జ్ఞానం, నైపుణ్యం ఉన్నాయా? లేదా అనే విషయాలకు ప్రాధాన్యత పెరిగింద న్నారు. మున్ముందు ఎలాంటి ఉద్యోగాల కల్పన ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి నిరంతరం అభ్యాసన, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. యూజీసీ ఆమోదం పొందిన యూనివర్సిటీల్లోనే చేరాలని కోరారు.

గవర్నర్‌ సందేశం
నూతనంగా పట్టాలు తీసుకున్న విద్యార్థులకు రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనివార్య కారణాలతో తాను నేరుగా స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్‌ పంపిన సందేశాన్ని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ కె. సీతారామారావు చదివి వినిపించారు. ప్రముఖ విద్యా వేత్త వి.ఎస్‌.ప్రసాద్‌కు డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌తో ప్రశం సా పత్రాన్ని జగదీష్‌ కుమార్‌ అందజేశారు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు, డైరెక్టర్లు, డీన్స్‌, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.