సమ్మిళిత అభివృద్ధి జరగాలి

There should be inclusive development– మేడిగడ్డ వ్యవహారం బాధ కలిగిస్తోంది
– కారకులపై చర్యలు తీసుకోవాలి
– బడ్జెట్‌లో పొందుపర్చిన అంశాలు ఆశాజనకంగా ఉన్నాయి.
– పద్దును స్వాగతిస్తున్నాం : శాసన మండలిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి జరగాలని భావించిన ప్రభుత్వం, ఆ విషయాన్ని బడ్జెట్‌ ప్రసంగంలో వ్యక్తం చేయటం అభినందనీయమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. బుధవారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేడిగడ్డను సందర్శించాననీ, ఆ బ్యారేజి వ్యవహారం గుర్తు చేసుకుంటే చాలా బాధేసిందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరిగిందనీ, కొండలు, గుట్టలు, సముద్రాలలోనూ డ్యాములు తదితర నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత నాసిరకంగా ఎలా నిర్మాణం చేశారో అర్థం కావటం లేదన్నారు. మేడిగడ్డలో తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. కారకులు ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ పత్రంలో వివిధ అంశాలను ప్రస్తావించారని వాటిని స్వాగతిస్తున్నానని తెలిపారు. విద్యారంగంలో వృధాను అరికట్టి, సరైన పద్దతిలో ఖర్చు చేసి, పనిచేస్తే ఫలితాలు బాగా వస్తాయన్నారు. సమాజంలోని ఆర్థిక, సామాజిక అంతరాలను తొలగించే శక్తి విద్యకు మాత్రమే ఉందని బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహణ పట్ల ప్రభుత్వం శ్రద్ద పెట్టాలన్నారు. గుడ్ల రేటు, ఇతర సరుకుల ధరలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. నిర్వాహకులకు చెల్లించాల్సిన బిల్లులను సకాలంలో చెల్లించాలన్నారు. ఆ పథకాన్ని రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చెల్‌ జిల్లాలో స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారనీ, దీంతో సగం మంది పిల్లలు భోజనం చేయటం లేదని తెలిపారు. గెస్ట్‌ లెక్చరర్ల నియామకాలు, మిగిలిన జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రతి కోర్సును ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించాలన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అభినందనీయమన్నారు. కులగణన చేపట్టాలనీ, దుబారా వ్యయాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావించటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సేద్యం చేసే వారికే రైతుబంధు ఇవ్వటంతోపాటు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పటాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
ఇచ్చిన హామీలు అమలు చేస్తాం.. : మంత్రి సీతక్క
ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. దీనిపై ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు. విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలా వృదా ఖర్చులు చేయబోమన్నారు.