మనిషిని మనిషికి దగ్గర చేసే సాహిత్యం రావాలి

There should be literature that brings man closer to man– గొప్ప సమాజం ద్వారానే గొప్ప సాహిత్యం పుట్టుక
– పద్మశ్రీ, మాజీ వీసీ ప్రొ.కొలకలూరి ఇనాక్‌
– ఘనంగా ముగిసిన తెలుగు సాహిత్య మహాసభ
నవతెలంగాణ-ఓయు
మనిషిని మనిషిగా దగ్గర చేసే సాహిత్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మశ్రీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.కొలకలూరి ఇనాక్‌ అన్నారు. ఓయూ ఆర్ట్స్‌ కళాశాలలో ఓయూ తెలుగు విభాగం ఆధ్వర్యంలో మూడ్రోజులు జరిగిన తెలుగు సాహిత్య మహాసభ -2024 ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన ప్రసంగించారు. గొప్ప సమాజం ఉంటే గొప్ప సాహిత్యం సిద్ధిస్తుందని, సాహిత్యం ద్వారా అన్ని రకాల అసమానతలు తొలగి పోతాయని చెప్పారు. సాహిత్యం సమాజానికి వెలుగు ఇవ్వొచ్చన్నారు. ఇలాంటి సాహిత్య మహాసభలకు కన్వీనర్‌గా ఉన్న చింతకింది కాశీం ఒక అసాధారణమైన ప్రొఫెసర్‌ అని ఆచార్య కొలకలూరి ఇనాక్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రావడంలో పాట నిర్వహించిన పాత్ర అద్భుతమని చెప్పారు. గొప్ప సాహిత్యమేదీ అహంకారంతో ఉండదన్నారు.
తెలుగు లిటరరీ కాంగ్రెస్‌ ఏర్పాటుకు వందేండ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వేదిక కావడం ఎంతో ఆనందంగా ఉందని కన్వీనర్‌ ప్రొ. సి.కాశీం అన్నారు. సగటు మనిషిని ఆవిష్కరించిన జానపద సాహిత్యంపై ఎంతో పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని ఆచార్య జయధీర్‌ తిరుమలరావు అన్నారు. ఆచార్య సి.కాశీం అధ్యక్షతన జరిగిన పరిశోధనా విపంచి సమావేశంలో జయధీర్‌ తిరుమలరావు తన పరిశోధనా ప్రయాణాన్ని వివరించారు. ఆనాటి సామాజిక ఉద్యమాలే తన పరిశోధనకు మూల ధాతువును అందించాయని అభిప్రాయపడ్డారు.
తెలుగు లిటరరీ కాంగ్రెస్‌ భావనను దేశవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని పులికొండ సుబ్బాచారి అభిప్రాయపడ్డారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను మౌఖిక సాహిత్యంతో జమిలిగా అధ్యయనం చేస్తేనే అది సమగ్రమవుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితోనే ఇతర తెలుగు ప్రాంతాలు తమ విసంతృత సాహిత్యలపై పరిశోధనలు చేస్తున్నాయని డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కమిషన్‌ ఇచ్చిన చైతన్యంతో 1980లో కాలంలో ఉత్పత్తి కులాల సాహిత్యంపై పరిశోధనలు చేయడం ప్రారంభమైందని డా.సంగిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. అనంతరం దేశంలోని అన్ని తెలుగు శాఖలకు అధ్యక్షులుగా ఉన్న 25 మంది ఆచార్యులు చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. తెలుగు భాషా సాహిత్యం- గమనం, గమ్యం అనే అంశంపై జరిగిన ఈ సమావేశం తెలుగు సాహిత్య చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆచార్య గుండెడప్పు కనకయ్య మాట్లాడుతూ.. తెలుగు కనుమరుగవుతుందనే మాటలన్నీ అవాస్తవాలని చెబుతూ తెలుగు భాష ఉనికి పట్ల ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.చింతా గణేష్‌, రిజిస్ట్రార్‌ ప్రొ.పి.లక్ష్మినారాయణ, ప్రముఖ కవి తొమ్మంగి వేణుగోపాల్‌ పాల్గొని మహాసభలు జరిగిన విధానాన్ని అభినందించారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. పలువురు శ్రమ జీవులను ఘనంగా సన్మానించారు. డిగ్రీ, గురుకుల, జూనియర్‌ కళాశాలు, పాఠశాలల నుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు పాల్గొని ఈ సాహిత్య మహాసభలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పులికొండ సుబ్బాచారి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌, నిఖిలేశ్వర్‌, తెలకపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.