– శ్రీశ్రీ కవిత్వం… పునర్జీవన ఇంధనం…
– కవిత్వం… వర్గ సంఘర్షణకు ఉత్సాహమివ్వాలి
– శ్రామిక కవి సమ్మేళనంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మనుషులను కలిపి ఉంచే పోరాటాలకు ఊతమిచ్చే కవిత్వం పెద్ద ఎత్తున రావాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.శ్రీశ్రీ జయంతి, మేడే సందర్భంగా తెలంగాణ సాహితీ నగర అధ్యక్షులు ఏబూషి నర్సింహ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రామిక కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. కవి యాకూబ్ ముఖ్య అతిథిగా, ప్రముఖ కవయిత్రి మహెజబీన్ విశిష్ట అతిథిగా, తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. కవయిత్రులు నస్రీన్ ఖాన్, ఎస్.కె.సలీమా ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలతో వక్తలు, నిర్వాహకులందరూ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహెజబీన్ మాట్లాడుతూ వనరుల దోపీడీ పాలనలో ఒక భాగంగా మారిపోయిన తరుణంలో శ్రీశ్రీ వారసత్వాన్ని కొనసాగించడమే ఆయనకు అర్పించే నివాళి అని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సమ్మేళనంపై ఏబీవీపీ దాడి జరిగాక, గతంలో యూనివర్సిటీల్లో జరిగిన దాడులు గుర్తుకొచ్చాయని తెలిపారు. రచయితలు, కవులు కూడా కార్మికులేనని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థి, యువతను మరింత చైతన్యం చేయాల్సిన అవసరముందని సూచించారు. వర్తమాన రాజకీయ నేపథ్యంలో అనేక ఉద్యమాలను ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. తాను రాసిన ‘ ప్రశ్నే దేశద్రోహమైంది’ అనే కవితను చదివి వినిపించారు.
కవి యాకూబ్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికోద్యమం, శ్రీశ్రీ జీవితం సమాంతరంగా సాగాయని గుర్తుచేశారు. మనుషులంతా వేరు వేరుగా అవుతున్న కాలంలో, స్వేచ్ఛ, లౌకికవాదం ప్రస్తావన తీస్తే ఒప్పుకోని కాలంలో వస్తున్నారు వస్తున్నారు జగన్నాథుని రథ చక్రాలొస్తున్నారు… అంటూ శ్రీశ్రీ మానవాళికి ఒక నిరీక్షణనిచ్చారని చెప్పారు. మనుషులందర్నీ స్నేహితులుగా చేసుకునే దగ్గరి నుంచి మనుషుల్లో వేషభాషలను చూసి మనవారిని ఎంచుకునే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో పునర్జీవనం కావడానికి ఉపయోగపడే ఇంధనమే శ్రీశ్రీ కవిత్వం అని తెలిపారు.
కె.ఆనందాచారి మాట్లాడుతూ మార్క్స్ చెప్పిన సారాంశాన్నే శ్రీశ్రీ అందించారని తెలిపారు. ఫాసిజం ప్రపంచమంతా, ముఖ్యంగా మన దేశంలో విస్తరించేందుకు యత్నిస్తున్న తరుణంలో శ్రీశ్రీ కవిత్వం మరింత అవసరమైందని తెలిపారు. మనుషులను విభజిస్తున్న ఈ పరిస్థితిలో వర్గ సంఘర్షణతోనే మనిషి మనిషిగా మారతాడని తెలిపారు. హిందూ – ముస్లీం ఘర్షణ జరిగిన ముజఫర్‌నగర్‌లో రైతు ఉద్యమంతో వర్గ సంఘర్షణ వారిని కలిపిందని చెప్పారు. అలాంటి సంఘ ర్షణకు ఉత్సాహమిచ్చే కవిత్వం రావాలని ఆకాంక్షించారు. సంపద సృష్టికర్తలు శ్రామికులేననే విషయాన్ని జగమంతా చెప్పాలని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో సమూహ సమావేశంపై జరిగిన దాడిని సమ్మేళనం తీవ్రంగా ఖండించింది. కార్యక్రమంలో హనీఫ్, జ్వలిత, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు కవితలను చదివి వినిపించారు.