పథకాల అర్హతపై పక్షపాతం మంత్రి పువ్వాడ తీరుపై నిరసన వెల్లువ

Bias on eligibility of schemes On the manner of the minister Outpouring of protest– రఘునాథపాలెం ఎంపీడీవో కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తత
– అనర్హులకు పథకాల కేటాయింపుపై ఆగ్రహం
– పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట
– ఎంపీడీవో చాంబర్‌ ఎదుట నిరసన
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పథకాల అర్హుల విషయంలో ప్రభుత్వ పక్షపాత ధోరణిని నివసిస్తూ… అధికార పార్టీయే అర్హతగా పథకాలు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల పరిషత్‌ కార్యాలయాన్ని విపక్షాలు శనివారం ముట్టడించాయి. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, బీఎస్పీ, జనసేన ఆధ్వర్యంలో సుమారు 3000 మంది ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి పువ్వాడ అజరు కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా నిరసనకారులను లాగే ప్రయత్నంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంపీడీవో కార్యాలయం గేట్లు మూసివేయడంతో కొందరు వాటి మీద నుంచి లోనికి దిగారు. నిరసనకారులు బలవంతంగా గేట్లు నెట్టుకొని లోపలికి ప్రవేశించి.. ఎంపీడీవో చాంబర్‌ ఎదుట ధర్నా చేశారు. ఆ సమయంలో ఎంపీడీవో రామకృష్ణ లేకపోవడంతో సూపరింటెండెంట్‌ జానీమియాకు వినతిపత్రం ఇచ్చారు. సుమారు మూడు గంటల పాటు ఈ ముట్టడి కొనసాగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రఘునాథపాలెంతో పాటు ఖమ్మం వన్‌ టౌన్‌, టూ టౌన్‌ నుంచి 50 మందికి పైగా పోలీసులు వచ్చి భద్రతా చర్యలు చేపట్టారు. రఘునాథపాలెం సీఐ, ఎస్‌ఐ శ్రీధర్‌, కొండిలావు, మరో ఇద్దరు సీఐలు కూడా విధులు నిర్వహించారు.
మంత్రి చెబితేనే పథకాలు: విపక్ష నేతలు
గృహలక్ష్మి, దళిత బంధు, రూ. లక్ష బీసీ ఆర్థిక సహాయం అర్హులకు దక్కకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. రీ సర్వే చేసి అర్హులైన పేదలకు పార్టీలకతీతంగా పథకాలు కేటాయించాలని అఖిలపక్ష నేతలు కోరారు. గృహలక్ష్మి పథకానికి మండలంలో ఏడు వేల మంది దరఖాస్తు చేసుకుంటే అధికారపార్టీకి చెందిన 1000 మందికి మంజూరు చేశారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ భవనాలు, పది, పదిహేను ఎకరాల భూములు ఉన్న వారిని సైతం గృహలక్ష్మి పథకానికి ఎంపిక చేయడంపై మండిపడ్డారు. గ్రామ సభలు నిర్వహించకుండా లబ్దిదారులను ఎంపిక చేశారని ఆరోపించారు. జిల్లా మంత్రి ఆదేశాలతో అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా అధికార పార్టీ కార్యకర్తల పేర్లను లబ్దిదారులుగా ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 దళిత వాడల్లో వేలాది మంది దళితులు ఉంటే వారిలో ఊరికి 20 నుంచి 30 మందిని మాత్రమే దళిత బంధుకు ఎంపిక చేశారని, పువ్వాడ కాలనీ చెందిన సర్పంచ్‌ బంధువులు ఏడుగురికి దళిత బంధు యూనిట్లు మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామానికి ఒకటి చొప్పున రూ. లక్ష బీసీ ఆర్థిక సహాయం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఇలా ఏ పథకమైనా అధికార పార్టీ వాళ్లకు ఇవ్వడం, లేదంటే తమ పార్టీలోకి వస్తేనే ఇస్తామనడంపై విపక్షనేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, వై. విక్రమ్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌. నవీన్‌ రెడ్డి, నాయకులు యర్రా శ్రీనివాస్‌, నందిపాటి మనోహర్‌, మెరుగు సత్యనారాయణ, చింతల రమేష్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్‌, మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజరు బాబు, నగర అధ్యక్షులు జావీద్‌, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా నాయకులు మంగతాయి, కేలోత్‌ లక్ష్మణ్‌, బీఎస్పీ నాయకులు అయితగాని శ్రీనివాస్‌, టీడీపీ నాయకులు లక్ష్మణ్‌, జనసేన నాయకులు స్రవంత్‌ తదితరులు పాల్గొన్నారు.