అరెస్టుకు బలమైన కారణమే లేదు

There was no compelling reason for the arrest– ఎఫ్‌ఐఆర్‌ పై సందేహం : ఢిల్లీ హైకోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
న్యూస్‌క్లిక్‌ చీఫ్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్తా, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అమిత్‌ చక్రవర్తిలపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన యూఏపీఏ కేసుపై ఢిల్లీ హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. అరెస్టు, ఎఫ్‌ఐఆర్‌ను ప్రశ్నిస్తూ ప్రబీర్‌, అమిత్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఢిల్లీ పోలీసులతో సందేహాలు లేవనెత్తింది. ఈ పిటిషన్లపై ఢిల్లీ పోలీసుల స్పందనను విచారించేందుకు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ కేసును సోమవారానికి వాయిదా వేసింది.
ప్రబీర్‌, అమిత్‌లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రిమాండ్‌ దరఖాస్తులో అరెస్టుకు గల కారణాలను ఎందుకు వెల్లడించలేదని జస్టిస్‌ తుషార్‌రావు గేదెల ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. అరెస్టుకు గల బలమైన కారణాలను వెల్లడించకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, ఈ విషయం మీకు తెలుసా? అని ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోర్టు ప్రశ్నించింది. రిమాండ్‌ ఆర్డర్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా కోర్టు గమనించింది. ఉదయం ఆరు గంటలకు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. డిఫెన్స్‌ లాయర్ల వాదన వినలేదని కోర్టు తెలిపింది.న్యాయవాదుల వాదన వినకుండానే రిమాండ్‌ ఉత్తర్వులు జారీ చేశారని ప్రబీర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. ”ఇద్దరి అరెస్టు చట్ట విరుద్ధం. అరెస్టుకు గల కారణాలను వెల్లడించలేదు. రిమాండ్‌కు ముందు న్యాయవాది వాదనలు వినలేదు. ఇది ఢిల్లీ హైకోర్టు నిబంధనలకే విరుద్ధం. ఈ కేసులో ప్రతివాదులు తప్పనిసరిగా లాయర్‌ను కలిగి ఉండాలని చట్టం పేర్కొంది. న్యాయవాది వాదనలు వినకుండానే రిమాండ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది ఎవరో వారికి తెలుసు. ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదు. అయితే తమ లాయర్‌కు సమాచారం ఇచ్చారు. ప్రతివాదిని వినకుండానే ఉత్తర్వులు జారీ చేశారు” అని సిబల్‌ వాదనలు వినిపించారు.
ఈ కేసును ఎలాగైనా పొడిగించాలని తుషార్‌ మెహతా ప్రయత్నం చేశారు. మెహతా ప్రత్యుత్తరంలో సమయం కోరారు. ఈ దశలోనే రిమాండ్‌ దరఖాస్తులోని లోపాలను, అరెస్టుకు గల కారణాలను తెలియజేయకపోవడంలోని న్యాయపరమైన లోపాన్ని కోర్టు ఎత్తిచూపింది. ఈ కేసును సోమవారం మొదటగా పరిశీలిస్తామని కూడా కోర్టు తెలియజేసింది. ఈ దశలో కేసు పత్రాలను అందజేస్తామని మెహతా హామీ ఇచ్చారు. అమిత్‌ తరపు న్యాయవాది తన క్లయింట్‌ డిఫరెంట్‌లీ ఎబుల్డ్‌ అని కోర్టుకు తెలిపారు. అమిత్‌ వైద్య అవసరాల్లో ఎలాంటి లోటుపాట్లు చేయవద్దని విచారణ అధికారిని కోర్టు ఆదేశించింది.కోర్టు జోక్యంతో ఎఫ్‌ఐఆర్‌ కాపీని స్వీకరించిన తర్వాత శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో కపిల్‌ సిబల్‌ కేసును ప్రస్తావించారు.