పదేళ్ల పాలనలో పంచాయితీ భవనం లేకపాయే

పదేళ్ల పాలనలో పంచాయితీ భవనం లేకపాయే– అద్దె భవనంలో గువ్వలేగి పంచాయితీ కార్యాలయం
– మూడేళ్ల క్రితం మాజీ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన
– నేటికీ పూర్తి కాని భవన నిర్మాణ పనులు
– అర్ధాంతరంగా నిలిచినా పట్టించుకోని పాలకులు
నవ తెలంగాణ-దౌల్తాబాద్‌
స్వపరిపాలనలో గ్రామాలను ఎంతో అభివద్ధి చేసుకుంటామని కలలుగన్నారు. పంచాయతీ హౌదాతో పాటు సమస్యలు నెరవేరుతాయని, సొంత భవనాల నిర్మాణం జరుగుతుందని ఆశపడ్డారు. పంచాయతీ హౌదా వచ్చి యేండ్లు గడుస్తున్నా కనీస సౌకర్యాల కల్పనకు నోచుకోవడం లేదు. మండలంలోని గువ్వలేగి గ్రామపంచాయతీ భవన నిర్మాణం పనులు అర్ధాంత రంగా నిలిచిపోయాయి. పనులు నిలిచి ఏళ్లు గడుస్తు న్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పదేళ్ల తెలంగాణ స్వయంపాలనలో పక్కా గ్రామ పంచాయతీ భవనం లేక నేటికీ గ్రామ పంచాయతీలు అవస్థలు పడుతున్నాయి. మండల పరిధిలోని గువ్వలేగి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం లేక పాలకవర్గం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో మాజీ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసినప్పటికీ నిధుల లేమితో నేటికి నిర్మాణ పనులు పూర్తికాక పిల్లర్ల దశలోనే పంచాయతీ భవనం దర్శనమిస్తుంది. ఫలితంగా ఒక పాత ఇంట్లో గ్రామపంచాయతీ కార్యాలయం కొనసాగుతుంది. శంఖుస్థాపన చేసి మూడు సంవత్సరాలైనా నాటి అధికార బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల పిల్లర్ల దశలోనే గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. అద్దె భవనంలో పంచాయతీ కార్యాలయాన్ని కొనసాగిస్తూ నామమాత్ర ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసినా సమావేశాలకు స్థలం సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీలను ఏర్పాటు చేసి యేండ్లు కావస్తున్నా భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయకపోవడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనైనా నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.