నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల వికలాంగులకు తీవ్ర అన్యాయం జరిగిందని వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య అన్నారు. డిఫరెంట్లీ ఎబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆద్వర్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేనికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ముత్తినేని మాట్లాడుతూ వికలాంగుల ఉద్యోగుల పట్ల గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసము వినతి పత్రం ఇవ్వడానికీ కూడా అవకాశము ఇవ్వలేదని తెలిపారు. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగ ఉద్యోగుల ప్రమోషన్లు, రిజర్వేషన్లు మూడు శాతం నుంచి నాలుగు శాతం వరకు పెంచేందుకు కృషి జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, డిఫరెంట్లీ ఎబుల్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హాబీబ్ మియా, జనరల్ సెక్రటరీ చిరబోయిన లక్ష్మయ్య , కోశాధికారి వెంకటనర్సయ్య, గౌరవాధ్యక్షుడు ముక్కు నర్సయ్య, బొల్లం మహేందర్, బిళ్ళ మహేందర్, మున్న నరసమ్మ, బండి నాగేశ్వర రావు తదితరులు హాజరయ్యారు.