– తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, రాజకీయపార్టీలు అనుసరించాల్సిన విధివిధానాలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. షరతులనూ ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బైక్ ర్యాలీలు, రోడ్ షోలు నిబంధనలకు లోబడే ఉండాలని పేర్కొంది. పై ర్యాలీల్లో ఎన్ని వాహనాలు పాల్గొంటాయో ముందస్తుగా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఒకే వరుసలో కాకుండా ప్రతి 10 వాహనాల తర్వాత కనీసం వంద మీటర్లు దూరం ఉండేలా ర్యాలీలు నిర్వహించాలి. అభ్యర్థుల కాన్వాయ్ లో సెక్యూరిటీతో సహా పది వాహనాలకు మించి ఉండకూడదు. వాహనాలకు అమర్చే జెండాలు, జెండా కర్రల సైజును కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. జెండా కర్రల ఎత్తు మూడు అడుగులకు మించి ఉండకూడదు. లౌడ్ స్పీకర్లను రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉపయోగించకూడదు. వీటి అనుమతికి కచ్చింతంగా సంబంధింత అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలి. జెండాల వినియోగంపైనా షరతులు విధించింది. ప్రచారం కోసం తాత్కాలిక క్యాంప్ కార్యాలయాలను నిబంధనలకు లోబడే ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. ఫోన్లలో సంక్షిప్త సందేశాలపైనా షరతులు విధించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు లోబడే ఇవి ఉండాలని పేర్కొంది. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి పార్టీ గుర్తులు, గోడరాతలు, నినాదాలు, బ్యాడ్జీలు ఉండరాదు. స్కూల్ గ్రౌండ్లను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకుంటే నిబంధనల్ని కచ్చింతంగా పాటించాలి. రాజకీయపార్టీల స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం కూడా నిబంధనలకు లోబడే ఉండాలి. వారి రూట్ మ్యాప్ ముందస్తుగా సంబంధిత అధికారులకు అందచేయాలి. ఎన్నికల నియమనిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కేసులు నమోదుచేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు.