భారతీయులు గర్విస్తున్న క్షణాలివి

ఆస్కార్స్‌లో అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిలవడం అద్భుతమైన విషయం. ఇలాంటి అద్భుతమైన అవకాశం రావడానికి కారణం వన్‌ మ్యాన్‌ ఎస్‌ ఎస్‌ రాజమౌళి. ఆయన ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, కీరవాణి, చంద్రబోస్‌, కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌.. మీరంతా కలిసి చరిత్ర సృష్టించారు.
చిరంజీవి
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది.
– బాలకృష్ణ
ఆస్కార్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌గా నిలిచిన ‘నాటు నాటు…’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్‌ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది. అంతేకాదు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది.
– పవన్‌కళ్యాణ్‌
ఆస్కార్‌ పురస్కారం అందుకోవడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పడం ఒక్కటే సరిపోదనిపిస్తోంది. నేనింకా కలలోనే ఉన్నాననిపిస్తోంది. ‘నాటు నాటు’ సాంగ్‌ కేవలం పాట మాత్రమే కాదు.. ఇది గ్లోబల్‌ ఎమోషన్‌. మేం గెలిచాం..ఓ ఇండియన్‌ సినిమాగా గెలిచాం.. ఓ దేశంగా గెలిచాం. – రామ్‌చరణ్‌
మేం ఆస్కార్‌ను సాధించాం. అలాగే ఆస్కార్‌ గెలుచుకున్న మొదటి ఇండియన్‌ డాక్యుమెంటరీగా మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ విధంగానే మీరు మరిన్ని కథలను చెప్పాలనుకుంటున్నాను. ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ బృందానికి
శుభాకాంక్షలు.
– ఎన్టీఆర్‌
నాటు..నాటు పాట హద్దుల్ని చెరిపేసింది. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ మన సొంతమైంది. ఇది భారతీయ సినిమాకి అపురూపమైన ఘట్టం. ముఖ్యంగా తెలుగు సినిమాకి.
– మహేష్‌బాబు