రాష్ట్ర రాజకీయాలు మూసీ సుందరీకరణ, హైడ్రాల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రభుత్వం మడమ తిప్పేది లేదంటున్నది. సాధారణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ చర్యలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. సమస్య పూర్వపరాలతో పాటు ఎవరి బాధ్యత ఎంతో కూడా బేరీజు వేయాలి. సరైన పరిష్కారాలు వెతకాలి. ఇప్పుడు జరుగుతున్నది ఇందుకు పూర్తిగా భిన్నం. పాలకులు తాము చేయదలచుకున్నదేమిటో సూటిగా చెప్పడం లేదు. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. వేలాది ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళనతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మూసీ నదిపైన ప్రభుత్వం చేయదలచిన చర్యల గురించి మీడియాలో రకరకాల ఊహాగానాలు నడిచాయి. సుందరీకరణ, ప్రక్షాళన, వరదల నుంచి పేదలను కాపాడటం, పర్యాటక కేంద్రంగా మార్చటం వంటి మాటలు ఈ చర్చల్లో వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం తలపెట్టింది మూసీ సుందరీకరణ కాదని, అది పునరుద్ధరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. సంపూర్ణ ప్రక్షాళన తప్పదని చెప్పారు. ఈ విషయంలో అన్ని పార్టీలు సలహాలు ఇవ్వవచ్చని, తమ సందేహాలను రాతపూర్వకంగా పంపాలని కోరారు. ఈ పద్ధతి అప్రజాస్వామికం. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. దాని అమలుకు సంబంధించిన సలహాలు మాత్రమే అడుగుతున్నది. పైగా చర్చలు కాకుండా పార్టీలు పంపే రాతపూర్వక సందేహాలకు తాము రాతపూర్వక సమాధానాలిస్తామని అంటున్నది. ఇది ఏకపక్ష ధోరణి. ఇతర పార్టీలు తమ ప్రణాళికలను ప్రభుత్వానికి అందజేయాలనటం హాస్యాస్పదం. ప్రాజెక్టులు రూపొందించడం, అమలు జరుపడం పాలకుల పని. తాము తలపెట్టిన ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రణాళిక తదితర అంశాలతో కూడిన సమగ్రమైన ప్రతిపాదనను ప్రతిపక్ష పార్టీలు, మేధావుల ముందుంచి అభిప్రాయాలను ఆహ్వానించడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికైనా అలాంటి ప్రతిపాదనలను అన్ని పార్టీలకు అందజేసి, అధ్యయనానికి తగు సమయమిచ్చి అఖిలపక్ష సమావేశం పిలువటం అవసరం.
ప్రభుత్వం చేయాల్సింది ఇది!
మూసీ వరద నీటిలో మునిగిపోయే పేద కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. మూసీ మధ్యలో గానీ, ముంపు ప్రాంతంలో గానీ పేదలు ఇండ్లు నిర్మించుకోవడం అంటే మరో దిక్కులేకనే. గృహవసతి కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యం వల్లనే మూసీ మురుగు వాసన కూడా భరిస్తూ జీవిస్తున్నారు. ఇలాంటివారికి మూసీ పరిసరాల్లోనే ఇండ్లు నిర్మించి ఆదుకోవాలి. కానీ ప్రభుత్వం చేస్తున్న పని ఇది కాదు. సుమారు పన్నెండు వేల ఇండ్లను ఖాళీ చేయించి నగర శివారు ప్రాంతాలకు తరలిస్తామని అంటున్నారు. మూసీ పూర్తిస్థాయిలో ప్రవహించినపుడు కూడా ఈ ప్రాంతాలు ముంపునకు గురికాలేదు. అలాంటి ప్రాంతా లు ఖాళీ చేయించ వల్సిన అవసరం ఏమిటి? ఇప్పటికే రెవెన్యూ శాఖ ఇండ్లు కూల్చివేసేందుకు సరిహ ద్దులను కూడా నిర్ణయిం చింది. సహజంగానే ఈ ప్రజలంతా నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేస్తున్న తీరును చూస్తే మూసీలో ముంపునకు గురయ్యే పేద కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో కాదనీ, ఈ చర్యల వెనక ఇంకేవో ప్రయోజనాలు దాగున్నాయని భావించవలసి వస్తున్నది. సుందరీకరణకు కూడా ఈ ఇండ్లన్నీ తొలగించవలసిన అవసరమే లేదు. మూసీ పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మించి గట్లమీద ఏపుగా ఎదిగే వృక్షజాతులను నాటవచ్చు. మూసీ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో కూడా వృక్షాలు పెంచడంతో పాటు చిన్నచిన్న పార్కులు ఏర్పాటు చేయవచ్చు. వీటివల్ల మూసీ సుందరీకరణ, పరిరక్షణతో పాటు నగర పర్యావరణం కూడా మెరుగుపడుతుంది. విరామ సమయంలో పిల్లలు, వృద్ధులు, ఇతర ప్రజలు సేదదీరడానికి కూడా ఈ పార్కులు తోడ్పడతాయి. కానీ ప్రభుత్వం దృష్టి ఈవైపు లేదు. ప్రక్షాళన అనే మాట కూడా వినబడుతున్నది. ఇది తక్షణం ప్రభుత్వం చేయవలసిన పని. ఈ సమస్యతో వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైద్రాబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట వరకూ ఏడు జిల్లాల ప్రజలు సతమతమవుతున్నారు. జంటనగరాల డ్రైనేజితో పాటు రసాయనాలతో కూడిన పారిశ్రామిక వ్యర్ధాలు మూసీలో కలుస్తున్నాయి. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఇది సమస్యగా తయారైంది. ఘట్‌కేసర్ నుంచి సూర్యాపేట వరకు ఈ నీటినే వ్యవసాయానికి, పశుపోషణకు కూడా వాడుతున్నారు. ఈ నీటితో పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులు ప్రజలు వినియోగిస్తున్నారు. ఫలితంగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. కాలుష్య నియంత్రణ కోసం పరిశ్రమలు, సివరేజ్ ప్లాంట్లు నిర్మించి తగు చర్యలు తీసుకోవాలని చట్టం ఉన్నప్పటికీ సక్రమంగా అమలు కావటం లేదు. సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు తగినన్ని ఏర్పాటు చేసినప్పటికీ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మాత్రమే అది సరిపోతుంది. నీటిలో రసాయనాలను పూర్తిగా తొలగించదు. ఇలాంటి నీరు మనుషులు, పశువులు తాగడానికి గానీ, వ్యవసాయానికి గానీ వినియోగించడం సాధ్యం కాదు. అందువల్ల మూసీ నీటిని సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా ప్రక్షాళన చేసి నేరుగా కృష్ణాలోకి పంపించాలి. వ్యవసాయానికి, తాగునీటి సౌకర్యం కోసం కృష్ణా, గోదావరి జలాలను అందుబాటులోకి తేవాలి. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇందుకోసం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వం నెలరోజుల పాటు విస్తృతంగా పాదయాత్ర కూడా చేసింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రక్షాళనకు పూనుకోవాలి. మూసీ నదిని ఆనుకుని ఉన్న జిల్లాల ప్రజల సమస్యలకు ఇది మాత్రమే సరైన పరిష్కారం. కానీ ప్రజల దృష్టిని ఆకర్షించటం కోసం మాత్రమే ప్రక్షాళన అనే మాట ప్రభుత్వం వాడుతున్నది. ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టులో నాలుగు జిల్లాలను మాత్రమే ప్రస్తావిస్తున్నది. మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తే ఈ ప్రాజెక్టు కేవలం వ్యాపార ప్రయోజనాలకు తప్ప ప్రజా ప్రయోజనాలకు కాదు. మూసీ నదిలోకి గోదావరి జలాలు తెచ్చి పడవలు నడపడానికి వీలైన స్థాయిలో నీటి ప్రవా హాన్ని నిలపాలని నిర్ణయించింది. మూసీ పరిసరాల్లోని ఇండ్లు తొలగించి హోటళ్లు, లాడ్జీలు, వాణిజ్య సంస్థలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా రూపొందించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇది నిజం కాకపోతే వాస్తవ ప్రతిపాదన ఏమిటో వెంటనే అఖిలపక్షం ముందుంచాలి. ఆ పని చేయకుండా మీడియా మీద కూడా నిందలు వేయడం తగదు. ప్రజా ప్రయోజనం రీత్యా చూసినా, ప్రాధాన్యతల రీత్యా చూసినా ఈ ప్రాజెక్టు అవసరం లేదు. పర్యావరణ నిపుణులతోనూ, మేధావులతోనూ, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతోనూ విస్తృత సంప్రదింపుల ద్వారా సరైన నిర్ణయానికి రావాలి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పు నేటి ప్రభుత్వం మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో చేయవద్దు.
రొచ్చుకుంటలో చేపలు పడుతున్న బీజేపీ ఉచ్చులో పడొద్దు
మూసీ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెపుతున్న బీఆర్‌ఎస్ నాయకత్వం తాము అధికారంలో ఉన్నప్పుడే దీన్ని ఎజెండా మీదకి తెచ్చింది. ఇంతలో ప్రభుత్వం మారింది. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాటతగదు. రాజకీయ పార్టీలు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికగా పరిష్కారాలు వెతకాలి. మరోవైపు ఈ సమస్యను బీజేపీ తమ స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది. మూసీ ప్రక్షాళన, పర్యావరణ పరిరక్షణ, ఈ ఏడు జిల్లాల ప్రజల ప్రయోజనాల పట్ల బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. గంగానదీ జలాల ప్రక్షాళన కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం రూ.37,750 కోట్లు కేటాయించింది. మూసీ నది విషయం మాత్రం కేంద్ర బీజేపీ సర్కారుకు పట్టదు. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే కదా. ఈ ఏడు జిల్లాల ప్రజలు కూడా భారతీయులే కదా. వీరు కూడా మనుషులే కదా. అయినా మూసీ ప్రక్షాళన గురించి కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడ మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి గురించి మాత్రం నోరు విప్పరు. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో, మరో ఎనిమిది శాసనసభ స్థానాల్లో గెలిపించారు. కేంద్రంలో వారి ప్రభుత్వమే ఉన్నది. ఈ ఏడు జిల్లాల ప్రజల సమస్యకు సరైన పరిష్కారం చూపి కేంద్రం నుంచి నిధులు తేవలసిన బాధ్యత బీజేపీ నాయకత్వం మీద ఉన్నది. అందుకు భిన్నంగా ఈ సమస్యను రాజకీయం చేసి వాడుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నది. సున్నితమైన ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనంలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రజాభిప్రాయాన్ని పరిగణన లోకి తీసుకోవాలి. ఇందుకోసం మూసీతో సంబంధం ఉన్న ఈ ఏడు జిల్లాల ప్రజలు సమైక్యంగా కదలాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. బాధిత పేద, మధ్యతరగతి ప్రజలకు ఐక్య పోరాటం తప్ప మరో మార్గం లేదు. ‘అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు’ అన్నది ఎంత నిజమో పోరాడకుండా పాలకులు ప్రజలవైపు చూడరు అన్నది కూడా అంతే నిజం. అందుకే ప్రజలు ఐక్యంగా కదలాలి.
ఎస్. వీరయ్య