– త్వరలో స్వల్ప భూకంపాలు రావచ్చు
– మోడీ కాడి కిందపడేస్తే… గడ్కరీ లాంటి నేతకు నాయకత్వ బాధ్యతలు : ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయ శాస్త్రవేత్త జెఫ్రెలాట్ సూచన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపలేని పక్షంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆయనను మార్చి నితిన్ గడ్కరీ లాంటి వారికి బాధ్యతలు అప్పగించాలని రాజకీయ శాస్త్రవేత్త క్రిస్టోఫ్ -జఫ్రెలాట్ సూచించారు. ప్రభుత్వం పతనం కావడం కంటే గడ్కరీ లాంటి నేతకు బాధ్యతలు అప్పగించి సంకీర్ణాన్ని ముందుకు నడిపించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ 23 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారని, అయితే ఆయనకు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం గతంలో ఎన్నడూ కలగలేదని గుర్తు చేశారు.
పారిస్‌లోని సైన్సెస్ పోలోనూ, లండన్‌లోని కింగ్స్ కళాశాలలోనూ జఫ్రెలాట్ దక్షిణాసియా రాజకీయాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రధాని మోడీ సంకీర్ణాన్ని సమర్ధవంతంగా నడపలేకపోతే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని ఆయన తెలిపారు. అలాంటప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి సమర్ధుడైన నాయకుడి కోసం ఆర్‌ఎస్‌ఎస్ అన్వేషించాల్సి ఉంటుందని చెప్పారు. ఇటీవలి ఎన్నికల ఫలితాలు ప్రకంపనల వంటివని, ఆ తర్వాత చిన్నపాటి భూకంపాలు రావచ్చని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో మెజారిటీ రాకపోవడం నరేంద్ర మోడీకి ఎదురు దెబ్బేనని, ఇప్పుడు ఆయన రాజీ పడుతూ కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ బీజేపీకి దక్షిణాది తలుపులు తెరుచుకున్నాయని జఫ్రెలాట్ అన్నారు. దీంతో ఈసారి ఆ పార్టీ నిజమైన జాతీయ పార్టీగా అవతరించిందని చెప్పారు. అయితే దక్షిణాది ద్వారాలను దాటుకొని, ఆ ప్రాంతంలో మరింతగా విస్తరించాలని కోరుకుంటే మాత్రం ఉత్తరాదిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. హిందీ-హిందూ ప్రాంతాలకే పరిమితమైన పార్టీగా పేరు తెచ్చుకున్న బీజేపీ, ఇకపై దానిని కోల్పోవాల్సి వస్తుందని అంటూ ఇది ఆ పార్టీని అయోమయంలో పడేస్తుందని జెఫ్రెలాట్ అన్నారు.