స్త్రీ అంతరంగ తరంగాలు ఈ కథలు

These stories are the inner waves of womenమూడు దశాబ్దాలుగా రచనారంగంలో అనుభవం గడించిన శైలజామిత్ర దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియలూ చేపట్టి కథారచనలోనూ తన సత్తా చాటుకుంటున్నారు. కవయిత్రిగా 8 కవితా సంపుటాలను వెలువరించిన ఈ రచయిత్రి గతంలో తరంగాలు, అడ్డా, ఆధునిక పంచ్‌ తంత్ర కథలు (బాలలకు ఉద్దేశించినవి) అనే కథా సంపుటాలను వెలువరించారు. తన అనుభవాల నేపథ్యంలో మన చుట్టూ కనిపించేవారినే పాత్రలుగా మలచి వాస్తవిక జీవన చిత్రణకు ప్రాధాన్యతనిచ్చే ఈ రచయిత్రి ఈ సంపుటిలోని ఎక్కువ భాగం కథల్లో స్త్రీ జీవితంలోని వివిధ పార్శ్వాలను స్పశించారు. ముఖ్యంగా ఆ పాత్రల మనస్తత్వవిశ్లేషణతో సాగే కథనపద్ధతి ద్వారా ఆ పాత్రల అతరంగతరంగాలను ఆవిష్కరించి వాటిని పాఠకులకు దగ్గరచేసే టెక్నిక్‌ కనిపిస్తుంది. ఇందులోని 25 కథల్లోనూ విభిన్న మానసిక, సామాజిక సంఘర్షణలు కనిపిస్తాయి. మనుషుల చిత్రవిచిత్ర ప్రవత్తులు జీవితాల మీద ఎంత ప్రభావాన్ని చూపుతాయో ఈ కథలు తెలియజేస్తాయి. ఆత్మీయతల్ని కాలరాసే దూరపుకొండల నునుపులూ వీటిలో కనిపిస్తాయి. కథల శీర్షికలు కూడా ఆకట్టుకుంటాయి. విదేశీప్రయాణాలు పెద్దవాళ్లకు తాము ఆశించే ఆత్మీయతల్ని దూరం చేసి వారిని ఎంత ఒంటరితనానికి గురిచేస్తాయో స్నేహితురాలి మాటల్లో తెలుసుకొని అప్రమత్తమయ్యే ఒక తల్లి, తమ పెంపకం కోసం రాత్రింబవళ్లు శ్రమించే తల్లిదండ్రులకు అవసానదశలో వారికి అండగా వుండడానికి వెనుకంజ వేసే ఒక కొడుకు, తన అత్తగారు తనను మాటలతో వేధిస్తుందన్న అనుమానంతో తనకు భాష రాదని ఆమెతో అబద్దం చేప్పి ఆ తరువాత ఆమె అంతరంగం తెలుసుకొని అబద్దం చెప్పినందుకు పశ్చాత్తాపపడే ఒక కోడలు, తాను పెనుతుఫానులో చిక్కుకొని ఆస్పత్రిలో ట్రీట్మెంట్‌ తీసుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడినట్టు కలగని, తాను కోడల్ని బాధించడం వల్లే ఆ కల వచ్చిందన్న ఆత్మన్యూనతాభావానికి లోనై కోడల్ని ప్రేమగా చూసుకునే ఒక అత్త, సైనికుల్లో ఉత్సాహాన్నీ, ఆత్మస్థైర్యాన్నీ పెంపొందించడానికి వారికి లేఖల రూపంలో మెయిల్స్‌ పంపే డైరెక్టర్‌ జనరల్‌, తన భార్య చిన్నతనంలో ఆమె ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనను తీవ్రంగా భావించి ఆమెపై అయిష్టాన్ని పెంచుకునే ఒక భర్త,… వీళ్లంతా ఈ కథల్లో పాత్రలు. కేవలం ఫ్యాషన్‌ కోసం, కాలక్షేపం కోసం తన క్లాస్‌ మేట్‌ అయిన అమ్మాయి వెంట పడే అబ్బాయి అవకాశవాదప్రేమ, నకీలీగొలుసు చోరీకి గురైతే రికవరీలో తనకు అసలు గొలుసు వస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసే గహిణి దురాశ, రాత్రిపూట ఒక ఆటోడ్రైవర్‌ బారినుంచి తప్పించునే ఒంటరి యువతి సమయస్ఫూర్తి, భార్య చనిపోతే ఆసరా కోసం అమెరికాలోని తన కొడుకు దగ్గరికెళ్లినా ఆక్కడి వాతావరణం అనుకూలించక గుండెపోటుతో మరణించే భర్త ఒంటరితనం… ఇవన్నీ ఈ కథలకు వస్తువులయ్యాయి.
మనుషుల్ని మానసిక సంఘర్షణకు గురిచేస్తూ మనకు నిత్యజీవితంలో కనిపించే విచిత్ర మనస్తత్వాలున్న పాత్రలు కూడా ఈ కథల్లో చోటుచేసుకున్నాయి. ‘ముఖంలేని చెట్టు’ కథ. ‘ఆడపిల్లా!’ కథలల్లో ఆడపిల్లల బాధలూ, మనస్తత్వాలు, సంబంధాలూ ప్రతిబింబించాయి.
జీవితం కల్పించే అనిశ్చితిలో, ఒంటరితనంలో మహిళ పడే వేదనను ఆవిష్కరించిన ‘వష్టి’ కథ ఒంటరి మహిళలకు సందేశాన్నిస్తుంది. ఈ కథలో ప్రధాన పాత్ర పేరే వష్టి. తన తల్లిదండ్రులు తనకు పర్షియన్‌ మహారాణి పేరు పెట్టినా భర్తకు దూరమై సమస్యలజడితో తన వేదనామయ జీవితంలో చెలరేగే అలజడిని తట్టుకోలేక వష్టి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే పక్కింటి యువతి అనారోగ్యానికి గురైందన్న వార్త ఆ ప్రయత్నాన్ని ఆపుతుంది. ఆ తరువాత భర్తకు దూరమైన ఆ యువతికి వష్టి స్నేహితురాలై వారి స్నేహం పర్యవసానంగా ఒంటరి తనంలోనూ సింహంలా బతకాలని నిర్ణయించుకుంటుంది. ఈ కథకు వష్టి అని పేరు పెట్టడమే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వష్టి అంటే అనిశ్చిత అనే అర్థం ప్రకారం సమాజంలో అనేక సమస్యలను ఎదుర్కొనే ఒంటరి మహిళ అనిశ్చిత స్థితిని సూచించడమే ఈ శీర్షిక ఉద్దేశంగా కనిపిస్తుంది. అదే సమయంలో మరో అర్థం మేరకు కొన్నేళ్లపాటు ఎన్నో సమస్యలనెదుర్కొంటూ పరిపాలించిన పర్షియన్‌ మహారాణి వష్టిలా ఒంటరి మహిళ పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోవాలన్నది రచయిత్రి ఆకాంక్షగా భావించవచ్చు. తనను ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త వున్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నా తన గుండెలోని ఒక అంచులో అతని పట్ల ప్రెమను పెంచుకునే యువతి ఆ తరువాత అతడు తన స్నేహితురాలి విషయంలో తప్పటడుగు వేసిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని తన కొడుకు ద్వారా తెలుసుకొని తన గుండెలోని ఇంకో అంచులో ఆశ్చర్యపోవడం ‘రెండంచుల గుండె’ కథలో చూస్తాం. ప్రపంచీకరణతో మారుతున్న కాలం రెండు తరాల మధ్య అనుబంధాల్ని, ఆత్మీయతల్ని ఎలా విచ్ఛిన్నం చేస్తుందో విడమరచి చెప్పిన కథ ‘కుదిరితే కప్పు కాఫీ’. ఇద్దరు కొడుకులు తమ తల్లిదండ్రుల పోషణను కూడా విభజించుకొని ఒకరు తల్లిని, మరొకరు తండ్రిని పోషించడానికి పూనుకుంటే ఆ తరువాత విచ్ఛిన్నమైన అనుబంధం వారి కళ్లు తెరిపించి మళ్లీ ఆ తల్లిదండ్రుల్ని ఒకే చోట వుండనివ్వడం ఆ కథలో కనిపిస్తుంది. అనుకోని అదష్టం, ఐశ్వర్యం మనిషిని ఎలా ఆవహిస్తుందో తెలిపే కథ ‘శివోహం’. శివాలయం ముందు భిక్షమెత్తుకునే ఒక వ్యక్తి ఆ ఆలయ జీర్ణోద్ధారణ అనంతరం అక్కడే స్వామిగా అవతారమెత్తి, ఆ తరువాత మరణించినా విగ్రహమై ప్రజల పూజలందుకోవడం ఈ కథలో చూస్తాం. స్వాతంత్ర దినోత్సవం నాడు హక్కుల విషయమై పిల్లలు తనను వేసిన ప్రశ్నలతో కనువిప్పుకు గురైన టీచర్‌ భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చిన తన కుమార్తెను హక్కులు సాధించుకోమంటూ తిరిగి మెట్టినింటికి పంపడం ‘కొండగాలి’ కథలో కనిపిస్తుంది.
‘అగ్ని పేదల గుడిసెల్ని చుట్టుకుంటుంది. అహం పెద్దల మనసుల్ని మండిస్తుంది. ఈ రెంటికీ పెద్ద తేడా లేదు'(ముఖంలేని చెట్టు), ‘దట్టమైన మేఘాలు కమ్ముకుని ఆకాశంపై అక్కడక్కడా తెల్లమచ్చల్లా ఆకాశపు తునకలు కనిపిస్తున్నాయి. ఆకాశపు పరిస్థితి గమనించి భూదేవి తనపై పడే కుంభవష్టిని తట్టుకునేందుకు సిద్ధమవుతోంది'(కొండగాలి) వంటి వర్ణనలు ఈ కథల్ని పరిపుష్టం చేశాయి. ఈ కథల్లో సాగే రచయిత్రి కథాసంవిధానం, పాత్రల చిత్రణ, శైలి ఈ కథల్ని మన మనసులకు హత్తుకునేలా చేస్తాయి.
డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర
9177732414