‘రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు మొద్దు నిద్రపోతున్నారా?’ అంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని మందలించే స్థితికి విద్యా వ్యవస్థ చేరింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే ‘విద్యార్థులకు పోషకాహారం అందించడంలో రాజీపడే ప్రసక్తే లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఇటీవల ప్రకటించారు. ఆయనే కాదు,రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులూ ఘటన జరిగిన ప్పుడు హడావుడి చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం నిత్యకత్యమైంది. ఆ తర్వాత షరామామూలే.
ఆర్థిక స్థోమత లేనివారు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో చేర్పిస్తారు. అక్కడైనా వారికి కడుపునిండా తిండి, నాణ్యమైన విద్య, భవిష్యత్తుకు భరోసా అందుతుందని వారి ఆశ. కానీ, గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ వల్ల తమ పిల్లలు ఆస్పత్రుల పాలయ్యారని తెలియగానే ఎక్కడో స్వగ్రామాల్లో కూలోనాలో చేసుకుని బతికే తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతారో చెప్పనక్కర్లేదు. వారి స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచిస్తేనే కడుపు తరుక్కుపోతోంది. పేద విద్యార్థులు చదువుకుంటున్న ఈ విద్యాసంస్థల పట్ల పాలకులు తమ బాధ్యతను మరచిపోతు న్నారని చెప్పడానికి పుడ్‌పాయిజన్ ఘటనలు నిదర్శనం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి రాష్ట్రంలో ఇలాంటివి అనేకం వెలుగుచూశాయి. ఈ ఏడాదిలోనే 38 సార్లు ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. నలుగురు విద్యార్థులు చనిపోయారు. 938 మంది విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరారు. జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, ఖమ్మం, నారాయణపేట, కరీంనగర్, కుమురం భీం, మంచి ర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, భువనగిరి జిల్లాల్లో అనేక ఘటనలు గురుకుల విద్యాసంస్థల్లో ఈ కాలంలో జరిగాయి. దీన్ని ప్రభుత్వం ఒక రాజకీయ అంశంగా కాకుండా ఉన్నత చదువుల కోసం వచ్చి పిట్టల్లాగా రాలిపోతున్న పేద విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాలి. అసలెందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది? విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో? తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఉంటే ఈ ఘటనలు పునరావృతం ఎందుకవుతున్నాయి.
కొత్తమెనూ అమలుపై పర్యవేక్షణేది?
2016 నుండి మెస్‌చార్జీలను గత సర్కార్ పెంచలేదు. రెండు నెలల క్రితం మెస్‌చార్జీలను ప్రస్తుత ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన ఛార్జీల ప్రకారం మెనూ అందుతుందా, లేదా అనే పర్యవేక్షణ అధికార యంత్రాంగంలో లేదు. గురుకులాలు, సంక్షేమ వసతి గహాల్లో కాంట్రాక్టులు తీసుకున్న వారు నాణ్యమైన వస్తువులు సరఫరా చేయడం లేదనే విమర్శలు అనేకం. ధరలు తక్కువగా ఉన్నవి, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు అందిస్తున్నరనేది కూడా నిజం. పూర్తిస్థాయిలో మెనూ పాటించక పోవడం వలన తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న మాట కూడా వాస్తవం. కేవలం ఘటన జరగ్గానే కొందర్ని బాధ్యులను చేస్తూ సస్పెన్షన్ చేస్తున్నది ప్రభుత్వం.ఈ అంశంపై మూలాల్లోకి వెళ్లకపోవడం విచారకరం. ఫుడ్ పాయిజన్ జరగటానికి నాణ్యమైన భోజనం అందకపోవడం ఒక్కటే కారణం కాదు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న గురుకులాల్లో పరిశుభ్రత లేకపోవడం, సరిపడా గదులు లేకపోవడం, అపరిశుభ్రమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానాలు చేయడానికి కూడా నీళ్లు దొరక్క అంటువ్యాధుల బారిన పడుతున్నారు విద్యార్థులు. కొంతమంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు. మరో పక్క చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, పాములు, తేళ్లకు నిలయాలుగా మారి అధ్వాన పరిస్థితిలో సంక్షేమవసతి గహాలు నెట్టబడ్డాయి. ఇందులో వసతిపొందే విద్యార్థుల బతుకులకు మరీ భద్రత లేకుండా పోయింది. ఇన్ని సమస్యలున్నా సర్కార్ ఎందుకు దృష్టి పెడ్టటం లేదని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.
అధిక సమయపాలన..మానసిక ఒత్తిడి
దీనికితోడు ఈ మధ్య గురుకులాల్లో తీసుకొచ్చిన అశాస్త్రీయమైన సమయపాలన విద్యార్థులను, ఉపాధ్యాయులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఉపాధ్యాయులు సైతం పర్యవేక్షణ చేసే అవకాశం లేకుండా చేసేలా ఉదయం నుండి సాయంత్రం వరకు తీవ్ర ఒత్తిడితో ఉన్న పనిగంటల్ని అమలు చేయడంతో విద్యార్థులు మానసికంగా బలహీనంగా ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరికి చదువు భారమనే ఫీలింగ్ రాకుండా దఢంగా ఉంచేందుకు కౌన్సిలింగ్‌లు కూడా లేదు. దీంతో కొత్తగా చేరినవారు, చదువులో ఒత్తిడిని అధిగమించనివారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.ఈ ఆత్మహత్యల పరంపర ఓవైపు రాష్ట్రంలో కొనసాగుతుండగానే జగిత్యాల జిల్లా పెద్దాపూర్‌లో, కుమరం భీం జిల్లా వాంకిడిలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు మరణించడం శోచనీయం. ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందిస్తామన్న ప్రభుత్వం వీటి నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. రాష్ట్రంలో ఈ సమస్యలు పరిష్కరించడానికి, సమీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ శాఖను చూస్తున్నారు. అంటే, విద్యారంగం మరింత ఉన్నతమైన స్థితిలో ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు.కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఫలితం శూన్యం. ఈ విద్యాశాఖ ఒక్కటే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలకు మంత్రులు లేరు. మరి ఎవరు ఈ సంబంధిత శాఖలకు సంబంధించిన విద్యార్థులను పట్టించుకోవాలి, వీరి సమస్యల్ని ఎవరు తీర్చాలి? దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
మధ్యాహ్న భోజనం విద్యార్థుల హక్కు
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ ఘటనలు పెరుగుతున్నాయి. వారికి పెట్టే ఒక్కపూట భోజనం కూడా సరిగ్గా అందిం చడం లేదు. పాఠశాలల్లో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఎవరి దయా దాక్షిణ్యాలతో అమలు చేస్తున్నది కాదు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రకటించే పథకం అంతకన్నా కాదు. అది విద్యార్థులు జీవించే హక్కులో భాగంగా వచ్చినదే. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మధ్యాహ్నభోజన పథకం తీసుకొచ్చామని చెబుతున్న పాలకులు, ఇదిఇది వారి హక్కు అని తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. రాష్ట్రంలో 27 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిలో 23లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 80 శాతం వరకు విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంతో లబ్ధి పొందుతున్నారు. ఇంతమంది విద్యార్థుల ఆకలి తీర్చడానికి 52 వేల మందికి పైగా వంట కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు, పర్యవేక్షణలో ఎన్నో సమస్యలు తలెత్తుతు న్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులైన వంటగదులు, వంట పాత్రలు, తాగునీరు లేని పాఠశాలలెన్నో ఉన్నాయి. పాఠశాలకు బియ్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరఫరా చేస్తే.. పప్పు, నూనె, కూరగాయలు, గుడ్లు వంటి వాటిని ఏజెన్సీవారు కొనుక్కొంటున్నారు.
వడ్డీకి తెచ్చి వండుతున్న కార్మికులు
ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1నుంచి 5వ తరగతి చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.70, 6-8వ తరగతి చదివే విద్యా ర్థులకు రూ.8.40, 9-10 తరగతులు చదివే విద్యార్థులకు రూ.10.40 కేటాయిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మొత్తం చెల్లిస్తున్నది. 6 నుంచి 8వ తరగతులు చదివే విద్యార్థులకు కేంద్రం 60 శాతం చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చెల్లిస్తున్నది.9, 10 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చెల్లిస్తున్నది. విద్యార్థులకు వారానికి మూడు గుడ్లు ఇవ్వాలి. ఒక్కో గుడ్డు ధర మార్కెట్‌లో రూ.7 నుంచి 8 వరకు ఉన్నది. అయితే, ఇందుకుగాను ప్రభుత్వం నెల నెలా బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో వంటకార్మికులే వడ్డీకి అప్పులు తెచ్చి ఆ ఖర్చులను భరిస్తున్నారు.ధరలు పెరగడం, జీతాలు సమయానికి రాకపోవడం వంటి సమస్యలతో నాణ్యమైన భోజనం అందించలేని పరిస్థితి కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. వీటికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలి. అలాగే మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలకు, అక్షయపాత్ర లాంటి సంస్థలకు, సెంట్రలైజ్ కిచెన్‌కు ఇవ్వాలని చేస్తున్న ఆలోచనలు మానుకోవాలి. ప్రభుత్వమే నేరుగా ఈ బాధ్యతల్ని తీసుకుని నిర్వహించాలి.
ఈ ఘటనల నుండి ప్రభుత్వం ఇప్పటికైనా నివారణా చర్యలు తీసుకోవాలి. విద్యావ్యవస్థ బలోపేతానికి తగిన నిధులు కేటా యించడం, రోజువారీగా ప్రభుత్వం ఇస్తున్న మెనూ అమలయ్యేలా చూడటం, ఈ పర్యవేక్షణ కోసం అవసరమైతే ప్రత్యేకంగా అధికారులను నియమించడం చేయాలి. సంక్షేమ వసతిగహాలు, గురుకులాల్లో సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలి. బలహీన వర్గాలు చదువుతున్న ఈ విద్యా సంస్థలపై ప్రత్యేకంగా దృష్టి సారించకపోతే పుడ్ పాయిజన్ ఘటనలు భవిష్యత్తులోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థులు చదువుకోవాలన్నా, వారి తల్లిదండ్రులు పాఠశాలల్లో చేర్పించాలన్నా సంశయించే పరిస్థితి వస్తుంది. విద్య అంటే బరువు కాదని, భవిష్యత్తుకు భరోసా అనే చైతన్యాన్ని సమాజానికి కలిగించాలి. దీనికి కావాల్సింది పాలకుల పర్యవేక్షణ, ప్రదర్శించాల్సింది చిత్తశుద్ధి.
టి. నాగరాజు
9490098292