వారు విచ్ఛిన్నకారులు

They are disruptors– మేం ప్రజలకు ప్రేమను పంచుతాం…
– బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎంఐఎంకు ఏటీఎంలు
– ఆ మూడు పార్టీలు ఒకటే
– ధరణితో లక్షల మంది రైతులకు నష్టం
– కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం అవినీతికి పాల్పడ్డారు
– మోడీ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు..
– కారుకు పంచరయింది…: కల్వకుర్తి, షాద్‌నగర్‌ సభల్లో రాహుల్‌ గాంధీ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ప్రాంతీయ ప్రతినిధి/కల్వకుర్తి/ షాద్‌నగర్‌
కులమతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. బీజేపీ భారతీయులను విచ్ఛిన్నం చేసేలా కుట్రలు చేస్తుంటే, తమ పార్టీ దేశాన్ని ఏకం చేస్తూ ప్రజలకు ప్రేమను పంచుతున్నదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య జరుగుతున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీ, ఎంఐఎం పార్టీలు బీ టీమ్‌గా పనిచేస్తున్నాయని, ఎన్నికల అనంతరం వారందరూ ఒకటవుతారని అన్నారు. దీనికి నిదర్శనం పదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మద్దతేనని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎంఐఎం పార్టీకి ఏటీఎం లాంటోరని వ్యాఖ్యానించారు. రెండు శాతం ఓట్లే లేనివారు రాష్ట్రంలో ఓబిసీని సీఎంను చేస్తామనడం హాస్వాస్పదమన్నారు. రాష్ట్రంలో ఆ మూడు పార్టీలు ఒక్కటై ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించి, 2024లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఓబిసీల కుల గణనను చేపడతామని అన్నారు. ఓబీసీల కులగణనతోనే ఆర్థిక సంక్షేమ వికాసానికి పునాది ఏర్పడుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో రాహుల్‌గాంధీ పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో ధరణి వల్ల దాదాపు 20 లక్షల మంది రైతులు నష్టపోయారని, ధరణీ వల్ల కేసీఆర్‌ కుటుంబానికి తప్ప మరెవ్వరికీ లాభం జరగలేదని రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణ ఏర్పడితే మేలు జరుగుతుందని ప్రజలందరూ ఎన్నో కలలుగన్నారని, వారి కలలను కేసీఆర్‌ కుటుంబం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచుకుంటూ పోయి చివరకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం, నీరు ఉబికి రావడం లాంటి సమస్యలు బయటపడుతున్నాయన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు భూములు పంచితే కేసీఆర్‌ మాత్రం ధరణి పేరుతో వాటిని లాక్కొని పేదలను రోడ్డున పడేశారని విమర్శించారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మరునాడే ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు దాడులు చేస్తారని, కానీ రాష్ట్ర సీఎంపై ఇప్పటివరకు అలాంటి దాడులు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. తనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 20 కేసులను అక్రమంగా బనాయించిందని, చివరకు నా పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దుచేసి ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా గుంజుకుందన్నారు.
మోడీ తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇస్రో సంస్థను బలోపేతం చేస్తే, తామే చేశామని మోడీ చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కారు పంచరయిందని, ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబాన్ని ఇంటికి పంపించడానికి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని అన్నారు.
ప్రజల సమస్యలను విస్మరించి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు.
సభల్లో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్‌ రెడ్డి, మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.