వాళ్లు విపత్తులాగా వచ్చి పడ్డారని అంటారు
వాళ్లు కాలుష్యంలాగా వ్యాపించారని అంటారు
వాళ్లు వ్యాధులని అంటారు
వాళ్లనే – బ్రాహ్మణులు మ్లేచ్ఛులని అంటారు
వాళ్లు ముస్లింలు!
సింధూ నది ఒడ్డున గుర్రాలు దిగి,
వాళ్లు – హిందూ హిందూ హిందూ – అని పిలిచారు
ఒక పెద్ద జాతికి వారొక గొప్ప పేరునిచ్చారు
ఆ నది పేరునే ఆ జాతి వారికిచ్చారు –
మహోధృతంగా ప్రవహిస్తున్న లోతైన
ఆ నదిని, దాటాలనుకున్నారు – వాళ్లు ముస్లింలు!
కబీర్ కున్న విజ్ఞత ఆసరా చేసుకుని ఉండి ఉంటే
వాళ్లు కూడా హిందువుల్లాగే పుట్టేవారు-
వాళ్ల దగ్గర ఎన్నెన్నో కథలుండేవి,
నడిచేవి, ఈదేవి, దాడి చేసేవి, మృత్యువుని కూడా-
వారి గుప్పిట్లో గుర్రాల కళ్లాలుండేవి
వారి కండ్లలో సభ్యత తొణికిసలాడేది
వాళ్లు మృత్యువు కోసం యుద్ధాలు చేసేవారు కాదు-
వాళ్లు ఫోరస్ నుండి వచ్చారు. ఇరాన్ నుండి వచ్చారు
తురాన్నించి, సమర్‌కంద్, షర్‌గనా, సీస్తాన్ నుండి వచ్చారు
తుర్కిస్థాన్ నుంచీ వచ్చారు – వాళ్లు ముస్లింలు!
చాలా దూరం నుండే వచ్చారు కానీ,
ఈ భూమి మీదున్న మరో ప్రాంతం నుండే వచ్చారు.
వారి హావ భావాలు – రూపురేఖలూ అన్నింటికన్నీ
మనుషుల్లాగానే ఉన్నాయి,
వాళ్లు సశక్తులయిన ప్రతిభాశాలురు – ప్రవాసులు!
ప్రతి పక్షం వారి రక్తంలో – మోకాళ్ల దాకా
వారి రక్తంలో భుజాల దాకా – వారు,
మునిగి పోయి ఉండేవారు – అంత మాత్రం చేత
వాళ్లు మృత్యువు కోసం యుద్ధాలు చేసేవారు కాదు-
వాళ్లే ముస్లింలు! ఎందుకంటే, వాళ్ల దగ్గర
దు:ఖ స్మృతులూ, దగ్ధ హృదయాలూ ఉంటాయి గనక!
వాళ్లు గుర్రాలతో పాటు పడుకునే వారు
రాళ్లూ రప్పలపై బీజాలు చల్లేవారు
నిర్మాణాలపై దృష్టి పెట్టేవారు – వాళ్లే ముస్లింలు!
ఒకవేళ సత్యాన్ని సత్యంగా చెప్పగలిగినప్పుడు,
ఆ సత్యాన్ని సత్యంగానే వినగలగాలి
ముఖ్యంగా వాళ్లు అలాగే ఉండేవారు
ఇంతకూ వాళ్లెవరు? ముస్లింలో కాదో తేలేదే కాదు
వాళ్లే ముస్లింలు!
వాళ్లు లేకపోతే లక్నో ఉండేది కాదు
సగం అలహాబాదు ఉండేది కాదు
వేసవి కుటీరాలు ఉండేవి కావు
గుండ్రటి ‘డోమ్’ లు ఉండేవి కావు –
ఆదాబ్ – ఉండేది కాదు.
మీర్, మగ్ధూమ్, మొమెన్ ఉండేవారు కాదు
షబనా – ఉండేది కాదు
వాళ్లు గనక లేకపోతే,
ఈ ఉపఖండపు సంగీతం వినడానికి
ఖుస్రూ ఉండేవాడు కాదు – వారే లేకపోతే,
ఈ దేశంలోని విద్వేషాలతో విసిగి వేసారిన
కబీర్ – ఉండేవాడు కాదు – వారు లేకపోతే,
ఈ భారత ఉపఖండపు దు:ఖాన్ని
కవితామయం చేసిన గాలిబ్ ఉండేవాడు కాదు
వారు లేకపోతే – 1857 నాటి
సిపాయి తిరుగుబాటు ఉండేది కాదు
తొలి స్వాతంత్య్ర సమరం జరిగేది కాదు
వాళ్లున్నారు కాబట్టి చాచా హసన్ ఉన్నాడు
వాళ్లున్నారు కాబట్టి, పతంగులతో ఆకాశం
రంగులమయమై పోయింది!
వాళ్లు ముస్లింలు! భారత్‌లో ఉన్నారు
వారి బంధువులు పాకిస్థాన్‌లో ఉన్నారు –
ఒక్కసారి పాకిస్థాన్ వెళ్లొస్తే బావుండునని అనుకునే వారు
కానీ, ఆ ఆలోచనతోనే భయకంపితులయ్యే వారు
అప్పుడప్పుడు చిరుసంతోషాలెదురౌతున్నా
భయంతో వణికిపోతుండేవారు
బయట పిఎమ్‌సి సిపాయికి ఎంత భయపడేవారో,
లోపల, జై శ్రీరామ్ నినాదానికీ అంతే గజగజలాడేవారు
వాళ్లు మురాదాబాద్‌కు భయపడే వారు
మీరట్‌కు, భగల్‌పూర్‌కు భయపడేవారు
విదిలించుకుంటూ ఉండేవారే కానీ, భయపడి ఛస్తుండేవారు
వాళ్లే ముస్లింలు! ‘పవిత్రమైన’ రంగులకు భయపడే వారు
వాళ్లు ముస్లింలయినందుకే భయపడేవారు
వాళ్లు పాలస్తినీయులు కాదు, అయినా కూడా
ఇంటిని చూసుకుని ఇంట్లో, దేశాన్ని చూసుకుని దేశంలో
తమని చూసుకుని తమలో నిబ్బరంగా ఉండలేకపోయేవారు
వాళ్లు ముస్లింలు! చెల్లా చెదరైన రాగ ద్వేషాలు వాళ్లు
అల్లికలు, పూలగుత్తుల తయారీ, బట్టలు కుట్టడం
పండ్లమ్మడం, మెకానిక్‌లు కావడం,
తాళాలూ, పెట్టెలు తయారు చేయడం
వారిశ్రమ – ధ్వని తరంగాలై, నలుదిశలా ప్రతిధ్వనిస్తూ ఉండేది.
వాళ్లు ముస్లింలే కానీ, సిరియా రాజధాని వారిది కాదు,
వాళ్లు ముస్లింలే కానీ, అరబ్బుల పెట్రోలు వారిది కాదు
వాళ్లు దజ్‌లా నది నీళ్లు కాదు,
ఇక్కడి యమున నీళ్లు తాగేవారు – వారే ముస్లింలు!
ముస్లింలు గనుకనే జాగ్రత్తగా తప్పించుకుని వెళ్లేవారు
ముస్లింలు గనుకనే ఏదైనా చెప్పాలంటే- సందిగ్ధంలో పడేవారు
దేశంలోని పత్రికలన్నీ ప్రముఖంగా రాసేవి
ముస్లింల కారణంగానే కర్ఫ్యూ విధించబడిందని!
కర్ఫ్యూ ఉండగానే ఒకదాని తర్వాత మరో సంఘటన
జరుగుతూ ఉందని…. వార్తలు వస్తుండేవి.
దడుసుకున్న వాళ్ల ఆడవాళ్లు
లబోదిబోమని మొత్తుకుంటుండే వాళ్లు
వాళ్ల పిల్లలు, గోడలకు అతుక్కుపోయి
బిగుసుకు పోయేవారు – వాళ్లే ముస్లింలు!
వాళ్లు ముస్లింలు గనుకే, తుప్పు పట్టిన
తాళం కప్పల్లా తెరుచుకునే వారు కాదు –
ఐదుసార్లు నమాజు చదివినా ఏం లాభం?
రోజుకు ఎన్నోసార్లు తల బాదుకుంటుండే వారు
ఇప్పుడు వాళ్లు అడగదలుచుకున్నారు
ఈ ఎర్ర కోటను ఏం చేద్దామని?
వాళ్లిప్పుడు అడగదలుచుకున్నారు
ఈ హుమాయూన్ సమాధిని ఏం చేద్దామని?
ఏం చేద్దాం ఈ మసీదుని? దీని పేరే ‘కువ్వత్ – ఉల్ – ఇస్లాం’ కదా!
ఇస్లాం శక్తి కేంద్రం – అని కదా దీని అర్థం?
వాళ్లు ముస్లింలు- అల్లం లాగా చేదు, వగరు వాస్తవాలు..
ఎటైనా వెళ్లిపోదామా? – అని అనుకునేవారు
కానీ, వెళ్లలేక పోయేవారు – వాళ్లు ముస్లింలు!
ఇక్కడే ఉందామని నిర్ణయించుకునే వారు
కానీ, ఉండలేక పోయేవారు – వాళ్లు ముస్లింలు!
సగం బలి ఇచ్చిన మేకల్లాగా వారి బాధ వర్ణణాతీతం
ఎంత చిన్న ఇబ్బంది నైనా ఇట్టే పసిగట్టేవారు
తుఫాన్‌లో చిక్కుకున్న నౌకలోని ప్రయాణికుల్లాగ
ఒకరి పక్కన ఒకరు చేరేవారు – వారు ముస్లింలు!
దేశంలో కొంతమంది ఒక చర్చను ప్రారంభించారు-
వీరిని విసిరేయాలంటే ఏ సముద్రంలో విసరాలని?
వీరిని తోసేస్తే ఏ కొండ మీంచి తోసెయ్యాలని?
ముస్లింలు వాళ్లు- ఎర్ర చీమలు కాదు.
సగటు మునుషులు వాళ్లు- అందరితో సరి సమానులు
సింధూకి దక్షిణాన, వేల ఏండ్ల నాగరికత తర్వాత,
అటూ, ఇటూ ఊగులాడే మట్టి బొమ్మలు కాదు వాళ్లు –
సింధూలాగ, హిందూ కుష్ లాగా – నిజాలు వాళ్లు!
పర్వత శిఖరాల వలె తలెత్తుకు నిలబడ్డవాళ్లు!!
నిజాన్ని ఎలా అర్థం చేసుకుంటారో,
అలాంటి నిజం వాళ్లు – వాళ్లు ముస్లింలు!
సభ్యతకు – అనివార్యమైన నియమం వాళ్లు
వాళ్లే ముస్లింలు – అబద్దపు పుకార్లు కాదు –
వాళ్లు ముస్లింలు – వాళ్లు మనుషులు!
హిందీకవి దేవీ ప్రసాద్ మిశ్రా కవిత ‘వే ముసల్మాన్ థే’కు నా తెలుగు అనుసరణ – ”వాళ్లు ముస్లింలు” – ఇక్కడ పొందుపరుస్తున్నాను. దేవీ ప్రసాద్ మిశ్రా కవి, కథారచయిత. లఘు చలన చిత్రాల రూపకర్త. ‘ఎక్కడైతే ఏమీ లేదో’ (జిదర్ కుచ్ నహీ) శీర్షికతో ఈయన సరికొత్త కవితా సంకలనం వెలువరించారు. అలాగే ప్రయోగాత్మకంగా రాసిన కథల్ని ‘మనిషినైనందుకు సంస్మరణ (మనుష్య్ హానేకి సంస్మరణ్) శీర్షికతో వెలువరించారు. 1958 ఆగస్టు 18న ఉత్తరప్రదేశ్, ప్రతాప్‌ఘడ్‌లోని హర్షపూర్ గ్రామంలో పుట్టారు. పుస్తక ప్రచురణకు మక్కువ చూపని ఈ కవి, మిత్రుల ప్రోద్భలంతో కేవలం మూడు పుస్తకాలు మాత్రమే ప్రచురించారు. సాహిత్య రంగానికి సంబంధించి భరత్ భూషణ్ స్మృతి సమ్మాన్, శరద్ బిల్లోర్ సమ్మాన్, సంస్కృతి సమ్మాన్ – వంటివి స్వీకరించారు. 1993లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ”ప్రతిభావంతులైన భారతీయులు” – శీర్షికన ప్రచురించిన 13 మంది జీవిత విశేషాలలో – దేవీ ప్రసాద్ మిశ్రా గురించి కూడా ఉంది.
భారతదేశంలో ముస్లింల పరిస్థితిపై, వారి చూట్టూ తిరుగుతున్న రాజకీయాలపై వెలువడిన ఈ రచన చేసిన మూల రచయిత అగ్రవర్ణానికి చెందిన వాడని గుర్తుపెట్టుకోవాలి! ఇంతటి హృదయ వైశాల్యం ఎంతమందికి ఉంటుంది? చారిత్రక అంశాలకూ, భావోద్వేగాలకూ ప్రాధాన్యమిచ్చిన ఈ రచనలో కవిత్వ లక్షణం తక్కువగా ఉంటే ఉండొచ్చు కానీ, ఉండాల్సిన మానవత్వ లక్షణం బలంగా ఉంది.
– కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత,
విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ (మెల్బోర్న్‌నుంచి)
– డాక్టర్ దేవరాజు మహారాజు