అవి బడ్జెట్‌ సమావేశాలు కాదు.. బుల్డోజ్‌ సమావేశాలు…

– ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌కు ఆస్కారమే లేకుండా చేశారు
– విలేకర్ల సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది బడ్జెట్‌ సమావేశాలు కాదనీ, అవి బుల్డోజ్‌ సమావేశాలని పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రశ్నోత్తరాలు, జీవో అవర్‌ లేకుండానే సభను నడిపారని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కోవ లక్ష్మితో కలిసి మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. డిమాండ్లపై కేవలం రెండు రోజులపాటే చర్చించటం శోచనీయమని ఆయన ఈ సందర్భంగా వాపోయారు. ఆర్‌ అండ్‌ బీ పద్దులపై మాట్లాడేందుకు తనకు అవకాశమే ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగలేదని విమర్శించారు. రేవంత్‌ది ప్రజా పాలన కాదనీ, అది ప్రతిపక్షాలపై పంజా విసిరే పాలనంటూ దుయ్యబట్టారు. సీఎం వికృత చేష్టలు ఏడు నెలల్లోనే బయటపడ్డాయని అన్నారు. ఆయన ఆటవిక రాజ్యం నడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు.