– ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర : కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు
– ఆయన నివాసంలో మౌనదీక్ష
నవతెలంగాణ-అంబర్‌పేట
తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్టు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని.. దీనిపై తగిన విచారణ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ అంబర్‌పేటలోని తన నివాసంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన మౌనదీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తనకు ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం టికెట్‌ను బయటవారికి ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలిపారు. తన ఆవేదనపై, తనపై కుట్రల మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన దీక్షను విరమింపజేశారు, దానం నాగేందర్ మాట్లాడుతూ.. వీహెచ్‌పై ఒక వర్గం చేస్తున్న అసత్య ప్రచారాలు నిరాధారమైనవన్నారు. బీఆర్‌ఎస్ పార్టీనే బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుందన్నారు. గతంలో కేటీఆర్ స్వయంగా బీజేపీతో పొత్తు పెట్టుకుందామని తనతో అన్నారన్నారు. సెక్యూలర్ పార్టీ అని చెప్పుకునే బీఆర్‌ఎస్ బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని కేటీఆర్‌ను ప్రశ్నించానని.. ఆ ప్రశ్నకు కేటీఆర్ నుంచి సమాధానం రాలేదని తెలిపారు. ఏదో ఒకరోజు వీళ్లు లోపాయికారి ఒప్పందం పెట్టుకుంటారని తెలిసి వారితో తెగతెంపులు చేసుకొని తన సొంత గూటికి వచ్చానని అన్నారు. బీజేపీకి ఉన్నది కేవలం సోషల్ మీడియా మాత్రమేనని, వాటి ద్వారానే అసత్య ప్రచారాలు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. సిద్ధాంతాలకు కట్టుబడి పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి హనుమంతరావు అని చెప్పారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దీక్షలో అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆర్.లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్‌గౌడ్, లక్పతి యాదగిరిగౌడ్, కట్టెల సుభాష్, పి.నారాయణస్వామి, జె.సత్తిబాబు, పి.వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.