‘తేమ’తోనే తంటాలు..!

 Adilabad– ప్రతి ఏటా అన్నదాతలకు ఎదురవుతున్న సమస్య
– తొలి పత్తిలో సహజంగానే తేమశాతం అధికం
– ధరలో భారీగా కోత విధిస్తుండటంతో ఆర్థికంగా నష్టం
– కొనుగోళ్లపై రేపు రైతులు, వ్యాపారులతో సమావేశం
తేమ..ఈ మాట పత్తి కొనుగోళ్లు జరిగినన్ని రోజులు రైతుల నోట వినిపించే మాట. పత్తి కొనుగోళ్ల సమయం రాగానే ఈ తేమ సమస్యతోనే రైతులు తంటాలు పడుతుంటారు. జిల్లాలో ప్రతి ఏటా ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా సహజంగానే పత్తిలో తేమ కొంత అధికంగా ఉంటుంది. దీంతో 8శాతం కంటే అధికంగా ఉంటే ఒక శాతానికి కిలో చొప్పున కోత విధిస్తున్నారు. అనేక ఆశలతో తొలి పత్తిని విక్రయించే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ప్రతి ఏటా సమస్య అన్నదాతలను వేధిస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొనుగోళ్ల సమయంలో ఈ సమస్య తలెత్తడంతో రైతులు ఆందోళన చెందడం కారణంగా విక్రయాలకు పలుమార్లు అంతరాయం కలుగుతున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది పత్తి కొనుగోళ్లకు అధికారులు సిద్ధం కావడంతో తాజాగా మరోసారి ఈ సమస్య ప్రధానంశంగా మారనుంది. ఈ నెల 3న తేదీన జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో రైతులు, వ్యాపారులు,అధికారులతో కొనుగోళ్లపై సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆసియాలోనే పేరుగాంచిన ఆదిలాబాద్‌ మార్కెట్‌లో ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడిప్పుడే రైతుల ఇంటికి చేరుతున్న పత్తి పంట మార్కెట్‌కు వచ్చే సమయం ఆసన్నమైంది. పత్తి కొనుగోళ్లపై ఈ నెల 3వ తేదీన రైతులు, వ్యాపారులు, అధికారులతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కొనుగోళ్ల తేదీని ప్రకటించనున్నారు. ఇప్పటికే మార్కెట్లను సిద్ధం చేసిన అధికారులు దసరా పండగ తర్వాత ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క కొనుగోళ్లలో భారత పత్తి సంస్థ(సీసీఐ) రంగంలో ఉంటున్నా.. 8 నుంచి 12శాతం మద్యలో తేమ చూపిస్తేనే కొనుగోలు చేస్తోంది. అంతకుమించి ఒక్క శాతం అధికంగా చూపించినా కొనుగోలుకు నిరాకరిస్తోంది.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రయివేటు వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. ప్రయివేటు వ్యాపారులు సైతం సీసీఐ నిర్ణయించిన ధర కంటే తక్కువగానే నిర్ణయించడంతో రైతులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోపక్క ప్రయివేటు వ్యాపారులు 18శాతం తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నప్పటికీ 8శాతం దాటితే ఒక్కో శాతానికి ధరలో కోత విధిస్తున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వమే నిబంధనలు మార్చి తేమశాతాన్ని 18శాతం వరకు పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
ఈ ఏడాది 32 లక్షలు టార్గెట్‌..!
కిందటేడాది జిల్లాలో 4,12,436 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. మార్కెట్‌కు 20,28,361 లక్షల క్వింటాల్‌ల పత్తి పంట మార్కెట్‌కు వచ్చింది. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థ(సీసీఐ) కొనుగోలు చేసిన పత్తి అధికంగా ఉంది. సీసీఐ 15,72,988లక్షల క్వింటాల్‌లు కొనుగోలు చేయగా.. ప్రయివేటు వ్యాపారులు 4,50,374లక్షల క్వింటాల్‌లు కొనుగోలు చేశారు. ఈ ఏడాది జిల్లాలో 4,33,317లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. 32,42,650లక్షల క్వింటాల్‌ల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది పత్తి పంటకు ప్రభుత్వ మద్ధతు ధర క్వింటాల్‌కు రూ.7520 నిర్ణయించగా.. కిందటేడాది క్వింటాల్‌కు రూ.7020 ధర ఉండేది. ఈ ఏడాది కేవలం రూ.500మాత్రమే స్వల్పంగా పెరిగింది. కానీ ప్రస్తుతం పెట్టుబడి పెరిగిన నేపథ్యంలో ఈ ధర ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని రైతులు అభిప్రాయ పడుతున్నారు. మరోపక్క మార్కెట్‌లో రైతులకు అవసరమైన తాగునీరు, మూత్రశాలలు, కాంటాలు తదితర వాటిని ముందస్తుగానే బాగు చేయాల్సిన అవసరం ఉంది.
కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాం
గజానన్‌, మార్కెటింగ్‌ ఏడీ, ఆదిలాబాద్‌
ఈ ఏడాది పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశాం. మార్కెట్‌లో రైతులకు అవసరమైన వివిధ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతాం. కొనుగోళ్ల ప్రారంభం విషయమై ఈ నెల 3వ తేదీన ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొనుగోళ్లు ప్రారంభిస్తాం.
పత్తికి సైతం బోనస్‌ అందించాలి
బండి దత్తాత్రి, రైతు సంఘం నాయకుడు
ప్రస్తుతం పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదు. స్వామినాథన్‌ సిఫార్సుల ప్రకారం ధర లేదు కాబట్టి ప్రభుత్వం పత్తికి సైతం బోనస్‌ ప్రకటించాలి. సన్నారకం వరికి ఇస్తున్న మాదిరిగానే పత్తికి కూడా కేటాయించాలి.మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలోనూ పత్తి కొనుగోళ్లు చేపడితే పోటీ వాతావరణం ఏర్పడి రైతులకు లాభం జరిగే అవకాశం ఉంటుంది.